టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్‌లో తలమునకలైంది.
ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.
ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ మైదానంలో ఉన్న డ్రాప్- ఇన్ పిచ్(drop-in pitch)ను శుక్రవారం పరిశీలించారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ పిచ్ బ్యాటర్లకు అనూకూలించేలా ఉందని సమాచారం.
ఇంతకీ డ్రాప్-ఇన్ పిచ్(drop-in pitch) అంటే ఏమిటి?
మ్యాచ్ జరిగే స్టేడియంలో కాకుండా బయట పిచ్‌ను తయారు చేసి.. ఆ తర్వాత దానిని అక్కడికి తరలించి నిర్ణీత ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), అడిలైడ్ ఓవల్, పెర్త్‌లోని కొన్ని స్టేడియాలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ మైదానాల్లో కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు.. సీజన్‌కాని సమయంలో ఫుట్‌బాల్, రగ్బీ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.
ప్రత్యేకమైన యంత్రం సాయంతో
ఎంసీజీలో 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న పిచ్‌ను నల్లరేగడి మట్టితో తయారు చేసి దానిపై గ్రాస్‌ను ఉంచుతారు. స్టీల్ ఫ్రేమ్స్‌లో తయారు చేస్తారు.
మ్యాచ్‌లు ఉన్న సమయంలో కస్టమైజ్డ్ ట్రక్‌లో తీసుకువచ్చి ప్రత్యేకమైన యంత్రం సాయంతో పిచ్‌ను డ్రాప్ చేస్తారు. మ్యాచ్‌లు ముగియగానే అదే మెషీన్ సహాయంతో దానిని అక్కడి నుంచి తొలగిస్తారు.
ఇక్కడ మొత్తం అవే
ఇక అమెరికా విషయానికొస్తే... తొలిసారిగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూయార్క్‌లో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ జరగడం కూడా ఇదే మొదటిసారి. టీమిండియా వంటి మేజర్ జట్లు ఆడే మైదానంలో డ్రాప్-ఇన్ పిచ్‌లను ఉపయోగిస్తున్నారు.
న్యూయార్క్ మైదానంలో వాడేందుకు 10 డ్రాప్ ఇన్ పిచ్‌లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్‌ల కోసం.. మిగతావి వార్మప్ మ్యాచ్‌ల కోసం వినియోగిస్తారు.
తయారు చేసింది వీళ్లే
అమెరికాలోకి తొలిసారి మేజర్ ఈవెంట్ జరుగనున్న తరుణంలో గతేడాది నుంచే పిచ్‌ల తయారీ మొదలుపెట్టారు. అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ గత డిసెంబరు నుంచి.. న్యూయార్క్ స్టేడియం కోసం ఫ్లోరిడాలో పిచ్‌ల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.
ఇందుకోసం డ్రాప్-ఇన్ ట్రేలను అడిలైడ్‌లో తయారు చేయించి.. ఓడల ద్వారా ఫ్లోరిడాకు తరలించారు. కాగా ఈ ట్రేలను స్థానికంగా దొరికే మట్టితో నింపి.. బెర్ముడా గ్రాస్‌ను దానిపై పరిచారు. తర్వాత ఫ్లోరిడాలో దాన్ని ఇంక్యుబేట్ చేసి పూర్తిస్థాయి పిచ్‌గా తయారు చేశారు.
తర్వాత వీటిని రోడ్డు మార్గం ద్వారా 20 సెమీ ట్రేలర్ ట్రక్కులలో జాగ్రత్తగా న్యూయార్క్‌కు తరలించారు. ఇక ఈ న్యూయార్క్ నసావూ కౌంటీ స్టేడియం కోసం లాండ్‌టెక్ గ్రూప్ అవుట్‌ఫీల్డ్‌ను తయారు చేసి ఇచ్చింది.
పక్కా టీ20 టైపే!
ఈ విషయం గురించి అడిలైడ్ ఓవల్ హెడ్ ప్రధాన క్యూరేటర్ డామియన్ హో ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘అనుకున్నట్లుగా పక్కా టీ20 తరహా పిచ్‌లు తయారు చేశామనే అనుకుంటున్నాం.
పేస్, బౌన్స్‌కు అనుకూలించడంతో పాటు పరుగులు రాబట్టేందుకు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. బ్యాటర్లు మైదానం నలుమూలలా బంతిని తరలించేలా.. షాట్లు ఆడేందుకు వీలుగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదీ న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ దాగుందన్న మాట!!
అమెరికాలో టీ20 వరల్డ్‌కప్ వేదికలు
👉న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం
👉ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం
👉డల్లాస్-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియం
లీగ్ దశలో న్యూయార్క్‌లో 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు జరుగనున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్(జూన్ 9)కు కూడా ఇదే వేదిక కావడం విశేషం.
చదవండి: T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment