భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.
ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్‌నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది.
చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్
Comments
Please login to add a commentAdd a comment