W T20 WC: కథ మళ్లీ మొదటికి... | Harmanpreet Kaur Bizarre Final Over Act Leaves Fans Baffled In IND Vs AUS Match, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

W T20 WC: కథ మళ్లీ మొదటికి...

Published Tue, Oct 15 2024 5:35 AM | Last Updated on Tue, Oct 15 2024 9:37 AM

Harmanpreet Kaur bizarre final over act leaves fans baffled in IND vs AUS match

నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్‌ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్‌ కప్‌ కోసం బయల్దేరే ముందు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్‌ కప్‌ ట్రోఫీ లేకుండానే హర్మన్‌ ముగించింది. 

వరుసగా గత మూడు టి20 వరల్డ్‌ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్‌... ఇదీ మన ప్రదర్శన. టీమ్‌ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్‌లో కచ్చితంగా టాప్‌–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్‌ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్‌ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్‌ గురించి ఎవరికీ సందేహాలు లేవు. 

ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు
గత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్‌ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్‌ బృందం ఫేవరెట్‌గా మారింది. 

కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్‌ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్‌ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. 

గ్రూప్‌ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్‌ సెమీస్‌ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్‌ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. 

ఆసీస్‌ ముందు తలవంచి
సెమీస్‌లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్‌ ముందు తలవంచాల్సి వచ్చింది. 

నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌లో హర్మన్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో  ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.

హర్మన్‌ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్‌–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. 

షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్‌ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. 

 సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్‌నెస్‌ క్యాంప్, స్కిల్‌ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్‌ అమోల్‌ మజుందార్‌ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం.    

–సాక్షి క్రీడా విభాగం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement