తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్‌ వీడియోలు | Sakshi
Sakshi News home page

తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్‌ వీడియోలు

Published Tue, Jan 10 2023 7:19 PM

Pakistan Crisis ata flour amid shortage one dead in stampede - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ద్రవ్యోల్బణం,  ఆర్థిక సంక్షోభానికి ఇటీవలి వరదలు తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.  ప్రధానంగా గోధుమ పంట నాశనంకావడంతో, గోదుమ‌ పిండి ధరలు కనీ వినీ స్థాయిలో పెరిగి పోయాయి. గోధుమ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. గోధుమ పిండి కోసం ప్రజలు పాట్లకు  సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతున్నాయి.

గోధుమల సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గోధుమలు పలు చోట్ల ప్రస్తుతం 10 కిలోల బస్తా రూ.1,500 ఉండగా, 20 కిలోల బస్తా రూ.2,800గా ఉంది. మరోవైపు అనేక ప్రావిన్స్‌లలో, సబ్సిడీపై పిండిని  సరఫరా చేస్తోంది ప్రభుత్వం. దీన్ని కొనుగోలు చేయడానికి వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో ఉన్నారు. ఇది ఘర్షణలు , తొక్కిసలాటలకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ,బలూచిస్థాన్‌లలో  తొక్కిసలాట కూడా జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్ ఖాస్ నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరిని నియంత్రించడానికి సైన్యాన్ని మోహరించారు.

తాము చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ అత్యవసర ప్రాతిపదికన 400,000 బస్తాల గోధుమలు అవసరం అని బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్‌జాయ్ తెలిపారు. తమ  ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని ప్రకటించారు.  బలూచిస్తాన్‌కు సహాయం చేయాలని ఇతర ప్రావిన్సులను ఆయన కోరారు. లేదంటే  సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బలూచిస్థాన్‌లో గోధుమ సంక్షోభానికి ఫెడరల్, సింధ్ , పంజాబ్ ప్రభుత్వాలను నిందించిన మంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి 600,000 బస్తాల గోధుమలను అందిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు.

రష్యా నుండి గోధుమలు దిగుమతి
దేశంలో గోధుమల కొరతను తీర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం 75 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు పెద్ద ఎత్తున కరాచీ పోర్టుకు చేరుకున్నట్టు  తెలుస్తోంది  అలాగే రష్యా నుంచి అదనంగా 4 లక్షల 50 వేల టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టు ద్వారా పాకిస్థాన్‌కు చేరుకోనున్నాయి.

కాగా పాకిస్థాన్‌కు సంబంధించి  దాదాపు 70శాతం గోధుమ ఉత్పత్తి పంజాబ్‌ నుంచే వస్తోంది. గోధుమల దిగుమతికి సంబంధించి ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఇదే గోధుమ పిండి కొరతకు దారి తీసిందని భావిస్తున్నారు.  ఈ సంక్షోభానికి  ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎంత గోధుమలను దిగుమతి  చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని విమర్శలు చెలరేగాయి. 

br />  

Advertisement
 
Advertisement
 
Advertisement