పత్తాలేని వాళ్లని పట్టేద్దాం, ఎగవేత దారులకు సెబీ నోటీసులు | Sakshi
Sakshi News home page

పత్తాలేని వాళ్లని పట్టేద్దాం, ఎగవేత దారులకు సెబీ నోటీసులు

Published Sat, Jan 8 2022 7:23 PM

Sebi Releases List Of Untraceable Defaulters - Sakshi

న్యూఢిల్లీ: పత్తాలేకుండా పోయిన ఎగవేత సంస్థలు, వ్యక్తులతో కూడిన జాబితాను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రకటించింది. సెబీ రికవరీ ఆఫీసర్ల ద్వారా ఆయా సంస్థలు, వ్యక్తులపై రికవరీ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు పేర్కొంది. అయితే చిరునామాలు లేనందున ఈ నోటీసులను ఎగవేతదారులకు దించలేకపోయినట్లు వెల్లడించింది. 2015 ఏప్రిల్‌ నుంచి 2021 జులై మధ్య కాలంలో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. ఎగవేతదారులు 2022 జనవరి 22లోగా సెబీ రికవరీ ఆఫీసర్‌ను లేఖ లేదా ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవలసి ఉంటుందని ఆదేశించింది.

జాబితాలో ఎంసీఎక్స్‌ బిజ్‌ సొల్యూషన్స్, ఈ సంస్థ ప్రొప్రయిటర్‌ సైయద్‌ సాదక్‌తోపాటు, భారత్‌ వాఘేలా, గిరిధర్‌ జే వగాడియా, కల్పేష్‌ బాబరియా, విఠల్‌భాయి గజేరా, లక్ష్మీనారాయణ వీరమల్లు దూసా, ఉమేష్‌ చౌకేకర్, బిందు ఆర్‌ మీనన్, నీలేష్‌ పాలండే, ఘనశ్యామ్‌ దయాభాయి పటేల్‌ పేర్లను సెబీ పేర్కొంది.

ఈ ఎగవేతదారులు పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి చెల్లించడం లేదా సెబీ విధించిన జరిమానా చెల్లింపులో విఫలమైనట్లు వివరించింది. సెక్యూరిటీల మార్కెట్లలో నమోదైన వివిధ అక్రమాలకుగాను జరిమానాలు విధించినట్లు తాజా నోటీసులో తెలియజేసింది.

Advertisement
 
Advertisement