రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్‌ | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్‌

Published Tue, May 7 2024 11:45 AM

రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్‌

ఏపీ అభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం

సహకరించలేదు

రాష్ట్ర విభజన చట్టంపై నిర్లక్ష్యం

ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ధ్వజం

రాజమహేంద్రవరం సిటీ: రాజకీయ లబ్ధి కోసమే ప్రధానమంత్రి యూటర్న్‌ తీసుకున్నారని ఎంపీ, వైఎస్సార్‌ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్‌ రామ్‌ ధ్వజమెత్తారు. ప్రజాగళం బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీని సర్వనాశనం చేసింది చంద్రబాబు అని గత ఎన్నికలలో విమర్శించిన మోదీ, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబును పక్కన పెట్టుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన తరువాత మన రాష్ట్రానికి ఆయన న్యాయం చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరుగుతున్నాయని సాక్షాత్తూ కేంద్ర ఫైనాన్స్‌ శాఖ హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారని గత ఎన్నికలలో ప్రకటించి, ఇప్పుడు ఆ ఏటీఎంతోనే ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. కేంద్రం పూర్తి నిధులు ఇవ్వకపోవడం వల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వకుండా చేసింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. రైల్వే జోన్‌, రామాయపట్నం పోర్టు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విశాఖ – చైన్నె కోస్టల్‌ కారిడార్‌కు నిధులు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి గౌరవం ఇవ్వకపోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాల ఆస్తులు పంపకం జరగలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్‌ అడిగినా, లిఖితపూర్వకంగా కోరినా ఫలితం లేకపోయిందన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు ఒక్క రూపాయి జమ కాలేదని, సీఎం జగన్‌ పాలనలో ఇసుక ద్వారా రూ.4 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయని వివరించారు. మద్యపాన నిషేధం దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమ పాలనను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం జగనన్న అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, మార్గాని నాగేశ్వరరావు, నందెపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement