ఈ పరిస్థితి మారేదెట్లా? | Sakshi Editorial Story On Canada PM Justin Trudeau And Dispute Between Canada And India - Sakshi
Sakshi News home page

India-Canada Dispute: ఈ పరిస్థితి మారేదెట్లా?

Published Wed, Sep 27 2023 12:40 AM

Sakshi Editorial On Canada PM Justin Trudeau

భారత – కెనడా సంబంధాలు కొంతకాలంగా ఇరుకునపడ్డ మాట నిజమే కానీ, గత వారం రోజుల పరిణామాలతో అధఃపాతాళానికి పడిపోయాయి. కెనడా పౌరుడైన ఓ ఖలిస్తానీ సిక్కును  భారత్‌ హతమార్చిందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో గత వారం చేసిన ఆరోపణ ఒక్కసారిగా పరిస్థితిని దిగజార్చింది. భారత ప్రభుత్వం ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం, కెనడా తన మాట వెనక్కి తీసుకోకపోవడం, వరుస దౌత్యవేత్తల బహిష్కరణలు... కొద్దిరోజులుగా వేడిని పెంచుతూ వస్తున్నాయి.

భారత్‌లో పర్యటించదలచినవారికి అనేక జాగ్రత్తలు చెబుతూ కెనడా ప్రత్యేక సూచన లిస్తే, కెనడా దేశస్థులకు వీసాల జారీని భారత్‌ నిలుపు చేసింది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన భారత సర్కార్‌ సదరు ఖలిస్తానీ మద్దతుదార్లకు దేశంలో ఉన్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం మొదలెట్టింది. తాజాగా ఐరాస వేదికపైనా అంతర్లీనంగా కెనడా వైఖరిని ఎండగట్టింది. వరుస చూస్తే,రెండు దేశాల మధ్య దౌత్యఘర్షణకు ఇప్పుడప్పుడే తెర పడేలా కనపడట్లేదు. 

ఈ వ్యవహారంలో తప్పంతా కెనడా ప్రధానిదే. వారం క్రితం భారత్‌పై తీవ్ర ఆరోపణతో రెండు దేశాల మధ్య దౌత్య తుపాను రేపిన ట్రూడో ఇప్పటి వరకు సాక్ష్యం చూపలేకపోయారు. అదేమంటే, ‘ఫైవ్‌ ఐస్‌’ గూఢచర్య కూటమి సేకరించిన సమాచారమే ఈ ఆరోపణకు ఆధారమని కెనడా దేశపు మీడియాలో లీకులు వస్తున్నాయి.

ఆ మాటకొస్తే ట్రూడో హయాంలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన అరాచకాలు అనేకం. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కొని యాడే శకటాలు, దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తూ ‘‘కిల్‌ ఇండియా’’ పేరిట పోస్టర్లు, హిందూ ఆలయాలపై దాడుల లాంటివన్నీ ఆయన ఏలుబడిలో ఎగసిపడ్డవే. కెనడాలోని సిక్కు ఓట్ల కోసం  తీవ్రవాద సభలకు సైతం ఆయన హాజరయ్యారు. అప్పట్లోనే భారత దౌత్యవేత్తలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

కెనడా ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలకే ట్రూడో పెద్ద పీట వేస్తున్నట్టున్నారు. ఖలి స్తానీ మద్దతుదారుల్ని సంతోషపరచి, నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించాలన్నదే ఆయన తాప త్రయంగా కనిపిస్తోంది. పరిణతి లేని ఆయన రాజకీయ చర్యలపై నిపుణులైన కెనడా దౌత్యవేత్తలు ఇప్పటికే పెదవి విరిచారు.

2018లో భారత పర్యటన సందర్భంగా నేరస్థుణ్ణి విందుకు ఆహ్వానించి ఫోటోలు దిగి రచ్చ రేపిన ట్రూడో తన తాజా చర్యలతో ఏకంగా భారత్‌తో బంధానికే పూర్తిగా నిప్పంటించేశారు. నిజానికి, భారత అభ్యర్థనపై 2016 నుంచి ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీస్‌లో ఉన్న తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ జూన్‌ 18న గుర్తు తెలియని దుండగుల తుపాకీ కాల్పులకు చనిపో యాడు. నాలుగు నెలల తర్వాత ట్రూడో నిద్ర లేచి, అది భారత్‌ చేసిన హత్య అనడం విడ్డూరం. 

పడిపోతున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే జస్టిన్‌ ట్రూడో ఇలా అంతర్జాతీయంగా భారత్‌పై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో 1968 నుంచి 1984 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసిన ఆయన తండ్రి ప్రియర్‌ ట్రూడో సైతం ఇలాగే పెడసరంగా వ్యవహరించారు. సిక్కు తీవ్రవాది తల్విందర్‌ సింగ్‌ పర్మార్‌ను అప్పగించమని అభ్యర్థిస్తే నిరాకరించారు.

చివరకు ఆ తీవ్రవాది ఓ ఉగ్రసంస్థకు అధిపతై, 1985లో ఎయిరిండియా విమానాన్ని బాంబు పెట్టి పేల్చేసి, 329 మంది మరణానికి కారణ మయ్యాడు. 2016లో తండ్రి లానే కొడుకు ప్రధాని కాగానే, ఆ కేసులో శిక్షపడ్డ ఏకైక వ్యక్తి పెరోల్‌పై విడుదలయ్యాడు. 2018లో ట్రూడో భారత్‌ సందర్శించినప్పుడు అప్పటి పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తాము అన్వేషిస్తున్న తీవ్రవాదుల జాబితాను అందజేశారు. తాజాగా మరణించిన నిజ్జర్‌ పేరూ అందులో ఉంది. ఈసారి పెద్ద ట్రూడో బాటలోనే చిన్న ట్రూడో చర్యలేమీ చేపట్టలేదు. 

నిజ్జర్‌ మరణంపై ఇంతవరకు చేసిన దర్యాప్తు, అనుమానితులు, అదుపులో తీసుకున్న పేర్లేమీ కెనడా చెప్పట్లేదు. ఇండియాపై ఆరోపణలు చేసి పది రోజులవుతున్నా తన వాదనకు బలం చేకూర్చే సాక్ష్యమేమీ ట్రూడో చూపలేకపోయారన్నది గుర్తించాలి. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే, నాజీ సంబంధాలున్న ఓ వయోవృద్ధుడిని శుక్రవారం కెనడా పార్లమెంట్‌ గౌరవించి, మరో తప్పు చేసింది. ఆఖరికి స్పీకర్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

తాము నెత్తిన పెట్టుకుంటున్న వ్యక్తుల నేపథ్యం తెలుసుకోవడంలో కెనడా పాలనా యంత్రాంగం విఫలమవుతోందనడానికి ఇది మరో మచ్చుతునక. భారత్‌ సైతం విదేశీగడ్డపై నివసిస్తూ, మాతృదేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నవారిపై ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. ఈ ఖలిస్తానీలకు నిధులెక్కడ నుంచి వస్తున్నాయి, వారికి తెరచాటు అండదండ ఎవరనేది కనిపెట్టి, సాక్ష్యాధారాలతో అంతర్జాతీయంగా బట్టబయలు చేయాలి.  

దేశంలో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల లాంటి వంద తలనొప్పులున్న ట్రూడో నిరాధార ఆరోప ణలకు దిగే కన్నా ముందు ఆ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎనిమిదేళ్ళ క్రితం ఎన్నుకున్న తనను 63 శాతం మంది ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణాలు గ్రహించాలి. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, నిధుల కోసం ఆయన పార్టీ వర్గాలు ఖలిస్తానీ అనుకూల వర్గాలపై అతిగా ఆధారపడడం మానుకోవాలి.

పౌరుల భావస్వేచ్ఛను పరిరక్షించాల్సిందే కానీ, ఆ మిషతో తీవ్రవాదం సాగిస్తే సహించబోమని అక్కడి సిక్కు ప్రవాసీలకూ స్పష్టం చేయాలి. కెనడాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్‌. అక్కడి పర్యాటకుల సంఖ్యలో నాలుగో స్థానం మనదే. కెనడాకెళ్ళే విద్యార్థుల్లో 40 శాతం మనవాళ్ళే. అందుకే ఎన్నికల్లో గెలుపోటముల కన్నా దేశాల మధ్య దశాబ్దాల బంధం ముఖ్యమని ట్రూడో గ్రహించాలి. భారత్‌ సైతం పరిస్థితిని చక్కదిద్దడమెలాగో ఆలోచించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇరుపక్షాలకూ కావాల్సిన అమెరికా మధ్యవర్తిత్వమూ అందుకు కలిసిరావచ్చు. 

Advertisement
 
Advertisement
 
Advertisement