Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స! | Sakshi
Sakshi News home page

Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!

Published Thu, May 9 2024 6:15 AM

అవగాహనే ప్రథమ చికిత్స!

ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్‌ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్‌ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్‌. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.

బెంగళూరులోని శాంతి నగర్‌లో ఉన్న ‘అనాహత్‌’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్‌ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్‌ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్‌లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్‌. ఆమె ఈ క్లినిక్‌ నిర్వాహకురాలు.

10 వేల మందికి ఒక క్లినిక్‌
బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్‌. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్‌ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్‌. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్‌. 

జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్‌ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్‌ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్‌ క్లినిక్‌’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్‌ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్‌ క్యాంప్స్‌ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్‌ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్‌ క్యాంప్స్‌ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్‌ చేయూతతో.

బీపీ, షుగర్‌ బాధితులు
‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్‌ వచ్చిన వారికి షుగర్‌ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్‌ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్‌. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు.  

70 రకాల పరీక్షలు
అనాహత్‌ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్‌లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్‌ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్‌ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.

‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్‌ క్యాంప్స్‌ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ.

Advertisement
Advertisement