పోటెత్తిన దసరా రద్దీ | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన రైళ్లు, బస్సులు

Published Sat, Oct 21 2023 4:44 AM

- - Sakshi

హైదరాబాద్: దసరా రద్దీ పోటెత్తింది. రైల్వేస్టేషన్‌లు, బస్టేషన్‌లు, నగర శివారు కూడళ్లలో శుక్రవారం ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి.

ఆర్టీసీ 5,250కి పైగా ప్రత్యేక బస్సులు..
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా కిటకిటలాడాయి. రెగ్యులర్‌ రైళ్లలో చాలా రోజుల క్రితమే రిజర్వేషన్‌లు బుక్‌ కావడంతో చాలామంది జనరల్‌ బోగీలను ఆశ్రయించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి.

అదనంగా 600 రైళ్లు..
సాధారణంగా ప్రతి రోజు సుమారు 85 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. మరో వంద ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వరకు సుమారు 600 సర్వీసులను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 1.85 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ప్రైవేట్‌ బస్సుల దోపిడీ..
ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ బస్సులు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్‌లు లభించని దూరప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు. విజయవాడకు రూ.450 నుంచి రూ.800కు పెంచారు. ఒక్కో ట్రావెల్‌ సంస్థ ఒక్కో విధమైన చార్జీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్‌ బస్సుల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.

సొంత వాహనాల్లోనూ..
బస్సులు, రైళ్లతో పాటు కార్లు, బైక్‌లు వంటి సొంత వాహనాల్లోనూ నగరవాసులు పల్లెబాట పట్టారు. టాటాఏస్‌, మ్యాక్సీ క్యాబ్‌లు భారీగా బయలుదేరాయి. దీంతో పలు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటలతరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగనుంది. రహదారులపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని ఆర్టీఏ అధికారులు సూచించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement