సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ | Sakshi
Sakshi News home page

సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌

Published Sat, Jul 15 2023 8:22 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సార్వత్రిక ఎన్నికల క్రమంలో బదిలీల వేగం పుంజుకుంది. ఇటీవల డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం శుక్రవారం అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ అదనపు కలెక్టర్లుగా నియమించింది. అలాగే ఆర్డీవోలకు సైతం స్థానచలనం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా నేడు, రేపు కూడా మరిన్ని బదిలీలు జరిగే అవకాశముందని సమాచారం.

సిద్దిపేట అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) ముజమ్మిల్‌ఖాన్‌ను పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించగా పెద్దపల్లి కలెక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణను టీఎస్‌ ఫుడ్స్‌ ఎండీగా నియమించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) దివాకర్‌ను జగిత్యాల అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌)గా నియమించగా అదనపు కలెక్టర్‌ మంద మకరంద్‌ను నిజామాబాద్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

పెద్దపల్లి అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) కుమార్‌ దీపక్‌ను నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేయగా అతనిస్థానంలో కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సతీమణి కరీంనగర్‌ జెడ్పీ సీఈవో ప్రియాంకను నియమించారు.

వెయిటింగ్‌లో ఉన్న జల్ద అరుణశ్రీని కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌)గా నియమించారు. ఈమె గతంలో కరీంనగర్‌ డీఆర్డీవోగా విధులు నిర్వహించారు.

కరీంనగర్‌ జాయింట్‌ కలెక్టర్‌(ట్రైనీ) నవీన్‌ నికోలస్‌ను తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీగా నియమించారు.

కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌) గరిమా అగర్వాల్‌ను సిద్దిపేట అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీస్‌)గా నియమించారు.

కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)గా ఉన్న శ్యాం ప్రసాద్‌లాల్‌ను పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా బదిలీఅయ్యారు.

శ్యాంప్రసాద్‌ లాల్‌ స్థానంలో సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కె.లక్ష్మికిరణ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆర్డీవోలు సైతం
ప్రస్తుతం ఉట్నూరు ఆర్డీవోగా ఉన్న కె.మహేశ్వర్‌ను కరీంనగర్‌ ఆర్డీవోగా నియమించారు. కరీంనగర్‌ ఆర్డీవోగా ఉన్న ఎన్‌.ఆనంద్‌కుమార్‌ను సిరిసిల్లకు బదిలీచేశారు. సిరిసిల్ల ఆర్డీవోగాఉన్న టి. శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్‌ అండ్‌ తహసీల్దార్‌ శేరీలింగంపల్లికి బదిలీపై వెళ్లనున్నారు. ప్రస్తుతం జగిత్యాల ఆర్డీవోగా ఉన్న మాధురిని సంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌గా పంపారు.

సివిల్స్‌–2016లో తెలంగాణ టాపర్‌
ముజమ్మిల్‌ఖాన్‌ 2014లో తొలిసారిగా సివిల్స్‌ రాస్తే ఐఆర్‌టీఎస్‌ వచ్చింది. శిక్షణ పూర్తయ్యాక ఏసీఎంగా కొలువు దక్కింది. 2015లో మళ్లీ సివిల్స్‌ రాయగా ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అందులో చేరకుండా పాత ఉద్యోగంలోనే కొనసాగుతూ మూడోసారి 2016లో సివిల్స్‌ రాయగా జాతీయస్థాయిలో 22వ, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించారు. ఐఏఎస్‌ శిక్షణ పూర్తి చేశాక 2018లో వికారాబాద్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌, హుస్నాబాద్‌ డిప్యూటీ కలెక్టర్‌ పని చేశారు. ఫిబ్రవరి 2020లో సిద్దిపేట జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈయన మాజీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ కుమారుడు కావడం గమనార్హం.

Advertisement
Advertisement