ఎన్నికలకుముందే ఎత్తిపోయిన టీడీపీ ఎంపీ అభ్యర్థులు
ఖర్చులకోసం డబ్బులేక అటూ ఇటూ పరుగులు
వస్తాయన్న డబ్బు రాలేదు.. ఇక ఎక్కడా డబ్బు పుట్టక అవస్థలు
పెళ్లి ముహూర్తం రెండ్రోజులే వుంది.. పీటలమీద ఇవ్వాల్సిన కట్నం కానుకలకు రావాల్సిన డబ్బు రాలేదు... ఇస్తానన్నవాడు పత్తాలేకుండాపోయాడు. వాణ్ని నమ్ముకుని ముహూర్తం పెట్టుకున్నాం... ఇప్పుడెలా ? డబ్బు లేకుంటే పెళ్లి ఆగిపోతుంది. నాన్న ఆపరేషన్‌కు పది లక్షలు ఇస్తే తప్ప కత్తెర పట్టేదిలేదన్నాడు డాక్టర్.. టైం ముంచుకొచ్చింది... డబ్బులు రాలేదు. ఇప్పుడెలా ? ఆపరేషన్ చేయకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.
అబ్బాయికి అమెరికా చదువుకు వీసా వచ్చింది.. కానీ అక్కడి కాలేజీ వాళ్ళు డబ్బు డిపాజిట్ చేయమన్నారు.. కట్టేస్తాం అని రెడీ అయ్యాం...టిక్కెట్స్ తీసేసాం... లగేజ్ సర్దేసామ్ కానీ చివరలో డబ్బు రాలేదు.. ఎలా మరి..చదువు ఆగిపోవాల్సిందేనా ? ఇలా ఉంటుంది డబ్బు పరిస్థితి... అవసరానికి అందకపోతే వారి మానసిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది..
తొలివిడతగా ఇచ్చిన డబ్బులు ఈ నెలన్నర రోజుల ప్రచారంలో ఖర్చయిపోయాయి ...మున్ముందు ఇంకా ఇస్తాం అని హామీ ఇచ్చినవాళ్లు చివరలో చేతులు ఎత్తేసారు..దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు.. రెండ్రోజుల్లో ఎన్నికలు ఉండగా దాదాపు ఏడుగురు చిన్న ఎంపీలు ( అంటే ఓ మోస్తరు స్తొమత ఉన్నవాళ్లు ) చేతిలో డబ్బుల్లేక గిలగిలా కొట్టుకుంటున్నారు.
బిగ్ షాట్స్ ...శ్రీభరత్ వంటివాళ్ళు ఏదోలా నెట్టుకొస్తున్న... చోటామోటా ఎంపీ అభ్యర్థులు మాత్రం డబ్బుల్లేక ఇటు క్యాడర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ముందు మీదగ్గర ఉన్నది ఖర్చు చేయండి ..ఢిల్లీ పెద్దలు ఎలాగు మనతోనే ఉన్నారు కాబట్టి ఎక్కణ్ణుంచయినా డబ్బు తెచ్చుకోవచ్చు. మనల్ని ఎవరూ ఆపరు..ఆపలేరు... అనే చంద్రబాబు భరోసాతో ఎంపీ టిక్కెట్లు పొందిన కొందరు టీడీపీ అభ్యర్థులు తమ దగ్గర ఉన్న డబ్బును ఇన్నాళ్లూ ఖర్చు చేసారు. దీంతోబాటు తమ పరిధిలోనే ఏడుగురు ఎమ్మెల్యేలకు సైతం డబ్బు సర్దుబాటు చేసే బాధ్యత వాళ్ళకే ఉండడంతో ఇబ్బందిపడుతున్నారు.
గతంలో లేనట్లు దాదాపు ఎన్నికలకు .నోటిఫికేషన్‌కు ఎక్కువ టైం ఉండడంతో ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. డబ్బు వస్తుంది అనుకున్న మార్గాలు వివిధ కారణాలవల్ల మూసుకుపోవడంతో సప్లై ఆగిపోయింది... అలాంటి పనులకోసం పనికొస్తారనుకున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు 'అలాంటివేం కుదరదు.. అంతా ఈసీ పరిధిలో వుంది మీ చావు మీరు చావండి.." అని చావు కబురు చల్లగా చెప్పడంతో ఏమి చేయాలో తోచడం లేదు.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తమ వాళ్లకు పరిచయస్తులకు ఫోన్లు చేసి ఓ రెండు, మూడుట్లు ఉంటే సర్దు గురూ అని అడుగుతున్నా ఈ రోజుల్లో అలాంటివి కష్టం అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్యతరగతి ఎంపీ అభ్యర్థులు ఈ చివరి రోజుల్లో చేతులు నలుపుకుంటున్నారు.
ఇన్నాళ్లూ ఖర్చుపెట్టింది ఒక ఎత్తు.. ఈ చివరి మూడు రోజులూ ఇంకో ఎత్తు. ఓటర్లకు పంచడమే కాకుండా ఎన్నికల పనుల్లో ఉండే మండల గ్రామ స్థాయి క్యాడరుకు డబ్బును నీళ్ల మాదిరి పారిస్తే తప్ప మాట వినరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో కిందికి కాళ్ళు అందాకా పైకి చేతులు అందాకా తాటిచెట్టు ఎక్కుతూ మధ్యలో ఉండిపోయిన పిల్లాడి పరిస్థితి అయిపొయింది. ఇటు క్యాడర్ మాత్రం డబ్బు వస్తుంది... రెచ్చిపోదాం అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment