1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం | Sakshi
Sakshi News home page

1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

Published Thu, May 9 2024 3:40 AM

1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

● కోత దశలో ఉన్న మామిడి తోటలపై అకాల వర్షప్రభావం ● జిల్లా అంతటా చల్లబడిన వాతావరణం

ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలో 1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. గత శనివారం నుంచి మంగళవారం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని 593 మంది రైతులకు చెందిన 1,353 ఎకరాల్లో మామిడి, ఐదుగురు రైతులకు చెందిన ఐదెకరాల్లో బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు తేల్చారు. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, తిరుమలాయపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో మామిడికి, రఘునాథపాలెంలో బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

చల్లబడిన వాతావరణం

ఉపరితల ద్రోణి కారణంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. ఈమేరకు బుధవారం ఉదయం వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో సగటున 10.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 22.4 మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కల్లూరు మండలంలో 1.2 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులు మొదలుకాగా, సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈ వర్షం కారణంగా జిల్లాలో బుధవారం సాధారణ ఉష్ణోగ్రతలే నమో దు కాగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గాలివానతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో విద్యుత్‌ శాఖ ఉద్యోగులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నయ్యారు. కాగా, కోత దశలో ఉన్న మామిడి పంట నేలరాలగా, పలుచోట్ల బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. అలాగే, పలుచోట్ల వరి, మొక్కజొన్న వంటి పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement