ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి

Published Thu, May 9 2024 8:30 AM

ప్రచా

చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల, రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వార్తాపత్రికల్లో ఈ నెల 12, 13 తేదీల్లో ప్రచురించే ప్రచార ప్రకటనలకు ముందుగా మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎంసీఎంసీలో సంప్రదించి రెండు రోజుల ముందుగా దరఖాస్తులు అందజేయాలన్నారు. వార్తా పత్రికల యాజమాన్యం కూడా అనుమతులు ఉన్నదీ, లేనిదీ గమనించి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తరువాతే ప్రచురించాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ముందస్తుగా అనుమతి పొంది జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో పోలయిన ఓట్లు 15,403

చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 15,403 మంది బుధవారానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఒక్కరోజే ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో 227 మంది, గుడివాడ 123, పెడన 66, మచిలీపట్నం 168, అవనిగడ్డ 130, పామర్రు 82, పెనమలూరు 211 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 1007 ఓట్లు పోలైనట్లు నోడల్‌ అధికారి షేక్‌ షాహెద్‌బాబు తెలిపారు.

ముగిసిన

హోం ఓటింగ్‌ ప్రక్రియ

చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైబడి వికలాంగత్వం కలిగిన వారికి ఎన్నికల సంఘం హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలోని 33 బృందాల ద్వారా నిర్వహించారు. జిల్లాలో 1,762 మంది హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,724 మంది ఓటు హక్కును హోం ఓటింగ్‌ ద్వారా సద్వినియోగం చేసుకున్నారు.

వేద విద్యార్థులకు

వార్షిక పరీక్షలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన స్మార్త పాఠశాలలో వేద విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోరంకిలోని స్మార్త పాఠశాలలో నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను ఆలయ ఈవో కేఎస్‌ రామరావు ప్రారంభించారు. ప్రశ్నపత్రాలను పరిశీలించి విద్యార్థులకు అందజేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిని పై తరగతులకు పంపిస్తామని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆగిరిపల్లి వేద పాఠశాల సీనియర్‌ ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసింహమూర్తి పరీక్షల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు షణ్ముఖశాస్త్రి, ఈఈ ఎల్‌.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి

రూ. లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ బ్యాంక్‌ కాలనీకి చెందిన వంగా వెంకటరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఏఈవో ఎన్‌.రమేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను సమర్పించారు.

ప్రచార ప్రకటనలకు   అనుమతులు తప్పనిసరి
1/1

ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి

Advertisement
Advertisement