‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్‌ఏ’ | Sakshi
Sakshi News home page

‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్‌ఏ’

Published Wed, Mar 13 2024 7:34 PM

BJP Khushbu Says Misinterpreted Rs 1000 alms Tamil womens - Sakshi

చెన్నై: మహిళలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే పార్టీ వక్రీకరిస్తోందని బీజేపీ నేత కుష్బూ సుందర్‌ అన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై కుష్బూ సుందర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

‘మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.1000 భిక్ష ఇస్తే.. వారికి ఓటు వేస్తారా?. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలిస్తే.. ప్రజలు ఇలా ప్రభుత్వం ఇచ్చే రూ.1000 భిక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె సోమవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అన్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను కించపరిచేలా ఉన్నాయని డీఎంపీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించిందని కుష్బూ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశారు.

‘మహిళలకు రూ. 1000 ఇచ్చే బదులు ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలి.అలా చేయటం వల్ల మహిళలకు వేల రూపాయలు పొదుపు చేసినట్లు అవుతుంది.వారి కుటుంబాలకు సాయం చేసినట్లు అవుతుంది. వాళ్లు  సంతోషంగా తల ఎత్తుకొని జీవిస్తారు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు  నా మాటలను తప్పుదోవ పట్టించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం డీఎంకే డీఎన్‌ఏ.. కానీ నాది కాదు’ అని కుష్బూ సుందర్‌  వివరణ ఇచ్చారు.

‘నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసి పారిపోయే వ్యక్తిని కాదు. ధైర్యంగా  మాట్లాడటం నేర్పిన వ్యక్తి కలైంజ్ఞర్‌ కరుణానిధి. మీరు( డీఎంకే) దానిని మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చి పోలేదు’ అని కుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు అయిన కుష్బూను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement