ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

Published Fri, May 10 2024 5:12 PM

Ap High Court Angry With Election Commission

ఎన్నికల సంఘంప హైకోర్టు సీరియస్‌

హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుపడింది?

ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది? 

ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు?

హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది? 

2019లో పసుపు కుంకుమ అనుతించినప్పుడున్న కోడ్ ఇప్పుడెందుకు పాటించలేదు? 

సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందర్రావు ముందుకు డీబీటీ స్కీంలకు నిధుల విడుదల కేసు వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది.

సంక్షేమ పథకాలకు సంబంధించి (Direct Benefit transfer) డీబీటీ నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏవిధంగా పక్కనపెడుతుంది?. లా పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?. తెలంగాణాలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతిచ్చారు? ఈ రాష్ట్రంలో ఈ పథకాలను ఏవిధంగా అడ్డుకుంటారు?’’అంటూ హైకోర్టు సీరియస్‌ అయ్యింది.

"హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది? న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలను ఇప్పుడు పాటించడంలేదని స్పష్టం అవుతోంది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ను ఇప్పుడు అనుసరించలేదని వెల్లడి అవుతోంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీకి హైకోర్టు ప్రశ్నలు వేసింది. "ఎన్నికల్లో అసలు నవతరం పార్టీ ఎన్నిచోట్ల పోటీచేస్తోంది? గతంలో ఎన్నిచోట్ల పోటీచేసింది?" అని ప్రశ్నించింది. అప్పీలు వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్.. హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం వ్యాఖ్యల అనంతరం హైకోర్టుకు  పిటిషనర్ తరఫు న్యాయవాది నాదకర్ణి క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున ఈ కేసును జూన్‌కు వాయిదా వేసింది హైకోర్టు.

ఈ కేసులో ఏం జరిగింది?

ఏపీలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు నిచ్చినట్లయింది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈసీ ఏం చేసింది?

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్నికల సంఘం పరిశీలించింది. దీనికి సంబంధించి సమీక్షించి తమకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. అయితే ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీ విషయంలో సీఈసీ ముందడుగు వేయలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిఫికేషన్‌ అడిగింది. ఇవ్వాళే డిబిటి నిధులు విడుదల చేయాల్సిన అవశ్యకత ఏముందంటూ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.

మళ్లీ హైకోర్టు ముందుకు 

ఓ వైపు డిబిటి పంపిణీ నిలిచిపోయినట్టయింది. ఇదే సమయంలో నవతరం పార్టీ పేరిట హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలయింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Advertisement
 
Advertisement