భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.
‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.
జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్‌మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment