
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.
చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి.
Comments
Please login to add a commentAdd a comment