నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్‌ఎఫ్‌సీ ఫండ్‌ | Sakshi
Sakshi News home page

నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్‌ఎఫ్‌సీ ఫండ్‌

Published Fri, Jun 23 2023 1:14 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌ : గ్రామ పంచాయతీల్లో నిధుల కటకట నెలకొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థిక సంఘం నిధులు మరో రూ.30 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.1150 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి సర్పంచులు నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్కో నెల పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు.

వేతనాలకూ ఇబ్బందులు
జిల్లావ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెలా స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు సిబ్బంది, కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు చెల్లించేవారు. ఇప్పటికే అన్ని జీపీల్లో అప్పులు తెచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో నెల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు.

తప్పని ఎదురుచూపులు
ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని రోజుల తరబడి సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు అప్పులు తెచ్చి కార్మికులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులకు కూడా డబ్బులను సర్దుబాటు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం వేచి చూస్తున్నారు.

ఇప్పటికే చాలా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జీపీ ఖాతాల్లో జమ అయిన నిధులకు కూడా ఫ్రీజింగ్‌ చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీలో ఒక్క చెక్కు కూడా పాస్‌ కావడం లేదని వాపోతున్నారు. అభివృద్ధి పనుల బిల్లులు సహా పంచాయతీలకు మొత్తం రూ.100 కోట్లకుపైగా రావాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

పది రోజుల్లో జమయ్యే అవకాశం
గ్రామపంచాయతీలకు పది రోజుల్లో నిధులు విడుదల య్యే అవకాశముంది. ఆర్థిక సంఘంతోపాటు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– జయసుధ, జిల్లాపంచాయతీ అధికారి

రూ.45 కోట్ల బకాయిలు..
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కోసం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ జాయింట్‌ ఖాతాతో డిజిటల్‌ టోకెన్‌ ప్రక్రియను 13 నెలల క్రితమే పూర్తిచేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే ఎస్‌ఎఫ్‌సీ మూడు నెలలుగా జమ చేయడం లేదు. గతేడాదికి సంబంధించి పూర్తిగా విడుదల చేసినా.. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి విదిల్చలేదు. గతేడాది, ఈయేడాదికి సంబంధించి ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నుంచి మొత్తం రూ.45కోట్ల వరకు జమ కావాల్సి ఉంది.

1/1

Advertisement
Advertisement