వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
ఐదు నెలల బాలుడి మెడ,కన్ను భాగంలో కరిచిన కుక్క
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందిన చిన్నారి
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఘటన
కుక్కను కొట్టి చంపిన కార్మికులు
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.
దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..
కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్‌నగర్‌లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.
బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.
అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..
సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment