రికార్డు స్థాయిలో తన ఆగ్రహాన్ని చూపించాడు సూరీడు.. అయినా ఓటర్ల అనుగ్రహం కోసం అనుక్షణం తపించారు నేతలు.. స్వేదంతో తడిసి ముద్దవుతున్నా పట్టు సడలకుండా ప్రచారం చేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ పారీ్టల అభ్యర్థులు నచ్చిన వ్యాపకాలతో సేదదీరుతున్నారు. ఫలితాలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో ఆహ్లాదంగా గడపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయా పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలూ ప్రచారంలో పాల్గొని.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.
మనవరాలితో సరదాగా పద్మారావు గౌడ్
సతీమణి అనిత, మనవరాళ్లతో దానం నాగేందర్
మనవడు ఆహాన్‌తో గడ్డం శ్రీనివాస్ యాదవ్
అలసిసొలసిన మనసుకు చిన్నారి చిరునవ్వులను మించిన సాంత్వన ఏముంది? అందుకేనేమో.. హైదరాబాద్ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన మనవడు ఆహాన్‌తో ఆటల్లో మునిగిపోయారు. తాను సైతం చిన్న పిల్లాడిలా మనవడితో ఆటపాటల్లో మునిగిపోతూ సోమవారం అంతా సేదదీరారు. సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ సైతం మంగళవారం మొత్తంగా ఇంటికే పరిమితమయ్యారు. రోజుల తరబడి అలుపెరగని ఎన్నికల ప్రచారాన్ని సాగించిన ఆయన మరో మూడు రోజుల్లో ఉత్తరాది పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మనవడు రుద్రాంశ్‌తో రాగిడి లక్ష్మారెడ్డి..
ఈ విరామంలో కుటుంబ సభ్యులతో మనవలు, మనవరాళ్లతో గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా క్షణం తీరిక లేకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లోనే ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మంగళవారం సందడిగా గడిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో.. మనవడు భవనం రుద్రాంశ్, కుమారుడు రాగిడి వెంకటసాయి రియాన్ రెడ్డిలతో కలిసి ఆటలాడుతూ వారితో కలిసి స్విమ్ చేస్తూ రీచార్జ్ అయ్యారు. ప్రచారంలో బిజీగా మారిన సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ముగిసిన తర్వాత మంగళవారం కుటుంబంతో కాస్త రిలాక్స్‌గా కనిపించారు. ఉదయం తన మనవరాళ్లతో ఇంట్లో సరదాగా గడిపారు.
పచ్చని పరిసరాల్లో...
ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసవి ఎండలను లెక్కచేయకుండా క్షణం తీరిక లేకుండా పనిచేశాం. పోలింగ్ పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కొంత మానసిక ప్రశాంతత అవసరం అని కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. మొక్కల మధ్య పచ్చని పరిసరాల్లో గడుపుతూ పెట్స్‌తో రిలాక్స్ అవుతున్నా.
– సునీతా మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి
ఆరోగ్యంపై దృష్టి..
తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవాలి. మనం ఓటరుకు ఏం చెప్పాలనుకుంటున్నామో వారికి చేరవేయాలనే తపనతో నియోజకరవ్గం మొత్తం కలియతిరిగాను. ఇక ఇప్పుడు ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మానసిక ప్రశాంతత కోసం 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా.అలాగే ఈ టైమ్‌లో ఆరోగ్యంపై దృష్టిపెట్టి తగిన మార్పు చేర్పులు చేసుకుంటున్నా.
– రంజిత్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి
మనవడు ఆర్యవీర్‌తో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
‘సాక్షి’ పత్రిక చదువుతున్న ఎమ్మెల్యే కాలేరు
Comments
Please login to add a commentAdd a comment