సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్‌రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్‌ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment