మతిభ్రమించినట్టు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
సీఎం అయినా భాష మారలేదు..దబాయింపులు మారలేదు
వీడియో మార్ఫింగ్‌లతో రేవంత్‌రెడ్డి అందరినీ మించిపోయారు
అన్ని వర్గాల మద్దతు.. మంచి మెజారిటీతో గెలుస్తా..
ముస్లింలకు కాదు..మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
మీట్‌ది ప్రెస్‌లో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి పదేళ్ల సమయం పడితే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘ఈకొద్ది కాలంలోనే ఆయన అబద్ధాల కోరు అని తేలింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదో నాలుగు నెలల్లో తెలిసిపోయింది. సీఎం అయినా భాష మారలేదు..దబాయింపులు మారలేదు. రేవంత్‌రెడ్డి మతిభ్రమించినట్టు మాట్లాడుతూ దిగజా రుడు రాజకీయాలు చేస్తున్నారు.
అబద్ధాల ప్రచారం, వీడియో మార్ఫింగ్‌లతో రేవంత్‌రెడ్డి అందరినీ మించిపోయారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. మానవబాంబై పేలుతా.. పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా.. ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. నీ భాష మార్చుకో..సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. చిల్లరమాటలు మానుకోవాలి’అని రేవంత్‌రెడ్డికి ఈటల హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది›ప్రెస్‌లో ఈటల రాజేందర్ మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని, మళ్లీ దాన్ని దెబ్బతీస్తే రేవంత్‌కు కూడా పుట్టగతులుండవు.
సీఎం మాటలకు విశ్వసనీయత లేదు. కమిటీల పేరుతో కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. గతప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌లపై ఎలాంటి విచారణ లేదు. నేటికీ ట్యాపింగ్‌లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బిల్లుల కోసం ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు మొదలు అందరూ 7 నుంచి 10 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. 20 ఏళ్లకు పైబడిన నా రాజకీయ జీవితంలో ఇంతటి ‘పొల్యూటెడ్ పాలిటిక్స్’ ను చూడలేదు. పాలించే జాతి మాదే, పాలించే కెపాసిటీ మాకే ఉంది అని అహంకారంతో రేవంత్ మాట్లాడుతున్నారు. అంత జాత్యహంకారం, కులరాజకీయం పని కి రాదు.
రద్దు చేయాలనుకుంటే అవన్నీ ఎందుకు చేస్తారు ?
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ మార్ఫింగ్ వీడియోలు చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలలో రేవంత్ ప్రమేయముందని ప్రచారం జరుగుతోంది, ప్రధాని మోదీ ఇతర రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే దళితులు, పేదలకు న్యాయం జరగాలని ఏబీసీడీ రిజర్వేషన్ల వర్గీకరణ దిశగా చర్యలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, వంటివి ఎందుకు చే స్తారు. ముస్లింలకు కాదు మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. బీసీలుగా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారని, మళ్లీ మ తప్రాతిపదికన ఎందుకని బీజేపీ వ్యతిరేకిస్తోంది.
మల్కాజ్‌గిరిలో ఏ సర్వేసంస్థలకు అందని ఫలితాలు
‘మల్కాజ్‌గిరిలో ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. అన్నివర్గాల మద్దతుతో మంచి మెజారిటీతో గెలుస్తా’అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మల్కాజ్‌గిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడినట్టు ఓ మార్ఫింగ్ వీడియో సోషల్‌మీడియాలో ప్రచారం చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.
ఢిల్లీలో ప్రధాని మోదీ, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాను గెలిస్తే మల్కాజ్‌గిరికి గుర్తింపుతోపాటు, రోడ్డు వ్యవస్థ, మెట్రోరైలు, ఐటీ. ఇండ్రస్టియల్ కారిడార్లు, మంచి విద్య, వైద్యం వస్తాయని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇక తనపై పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గురించి ఇక్కడి ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, ప్రధానకార్యదర్శి ఆర్.రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు వనజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment