
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.
మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment