ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది.
ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment