సాక్షి, హైదరాబాద్: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోకొచ్చే 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో అంతటి విజయాన్ని నమోదు చేయలేకపోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. రాజధాని నగరంతో కలగలసి ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు సంగతి అటుంచి కనీసం రెండోస్థానంలో కూడా లేకుండా పోయారు. అంతే కాదు.. డిపాజిట్ తిరిగి పొందడానికి అవసరమైన కనీస ఓట్లను కూడా పొందలేకపోయారు. దీంతో కారు పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.
ప్రజలు తమ వెంటే ఉన్నారనుకుని..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా గ్రేటర్ నగరంలో తమ పట్టు చెక్కు చెదరలేదని పార్టీ నేతలు భావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించనందుకు ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎక్కువ లోక్‌సభ సీట్లు సాధించడం ద్వారా ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. నగరంలో తాము చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు గెలిపిస్తారని, ఎక్కువమంది ఎంపీల బలంతో ఢిల్లీలోనూ సత్తా చూపుదామని ఉత్తేజపరిచారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సభలకు, కేటీఆర్ రోడ్‌షోలకు హాజరైన ప్రజలను చూసి గెలుపు తమదేనని భావించారు.
ఫలితాలను చూసి.. కంగు తిని..
గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల బలంతో ఎంపీ సీట్లు కూడా తమకే వస్తాయనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే అసెంబ్లీ నాటి విజయం సంగతి అటుంచి పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం పోలైన ఓట్లలో 1/6 (16.66 శాతం) ఓట్లు లభిస్తే అభ్యర్థులు డిపాజిట్‌గా ఉంచిన నగదు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థులు ఆషామాషాగా పోటీ చేయకుండా ఉండేందుకు డిపాజిట్ జమ చేసుకోవడం తెలిసిందే. డిపాజిట్ పొందడానికి అవసరమైనన్ని ఓట్లు రాకపోవడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment