మోదీతో విజయన్‌ రహస్య ఒప్పందం: సీఎం రేవంత్‌ రెడ్డి  | CM Revanth Reddy Comments On Vijayan Secret Deal With Modi, Details Inside - Sakshi
Sakshi News home page

మోదీతో విజయన్‌ రహస్య ఒప్పందం: సీఎం రేవంత్‌ రెడ్డి 

Published Fri, Apr 19 2024 5:02 AM

CM Revanth Reddy Comments On Vijayan secret deal with Modi - Sakshi

కేరళ సీఎం కమ్యూనిస్టు కాదు కమ్యూనలిస్ట్‌: సీఎం రేవంత్‌ రెడ్డి 

ఈడీ, ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు ఆయన సీపీఎంను, కేరళ ప్రజలను మోసం చేస్తారు 

జూన్‌ 9న రాహుల్‌ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు 

వయనాడ్‌ పర్యటనలో సీఎం ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాని మోదీతో కుమ్మక్కై కేరళ ప్రజలనే గాక, సొంత పార్టీ సీపీఎంను కూడా మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తా రు. పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. బంగారం స్మగ్లింగ్‌లో సీఎం, ఆయన కుటుంబసభ్యుల పాత్ర ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నా రు. విజయన్‌పై ఈడీ, ఐటీ కేసులున్నప్పటికీ మోదీ చర్యలు తీసుకోవడం లేదని, ప్రధాని మోదీతో కేరళ సీఎం రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానంలో పర్యటిస్తున్న రేవంత్‌ గురువారం అక్కడ జరిగిన రైతుల సమావేశంలో ప్రసంగించారు. 

కమ్యూనిస్టు కాదు... కమ్యూనలిస్టు 
రాష్ట్రాల ప్రయోజనాలు, రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని, ఈ దిశగా తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు నిధుల కోసం పోరాడుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే కేరళ సీఎం విజయన్‌ మాత్రం కేంద్రంతో పోరాటం చేయకుండా, మతతత్వ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పైకి సీపీఎం పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్‌ కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని వ్యాఖ్యానించారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు విజయన్‌ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈడీ, ఐటీ కేసులున్నన్ని రోజులు సీపీఎం కోసం విజయన్‌ పని చేయరని దుయ్యబట్టారు. 
 
వయనాడ్‌ ప్రజల అభిమానాన్ని చూసేందుకే వచ్చా.. 
కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారని, తెలివైన వారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్‌ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయి కానీ కేరళ మాత్రం అభివద్ధి చెందలేదన్నారు. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గూండాల చేతిలో చనిపోయారని, అయినా మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో పర్యటించలేదని మండిపడ్డారు. కానీ రాహుల్‌ గాంధీ అక్కడి బాధితులను కలిసి మాట్లాడారని గుర్తు చేశారు.

జూన్‌ 9న రాహుల్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని, వయనాడ్‌ ప్రజలు ఓటేసేది ఒక ఎంపీకి కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని అన్నారు. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని, మోదీ పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని పేర్కొన్నారు. అదే ఇండియా పరివార్‌లో సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాందీతోపాటు వయనాడ్‌ కుటుంబ సభ్యులున్నారన్నారు. ఇందిరా, రాజీవ్‌లు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే, సోనియా, రాహుల్‌ ప్రధాని పదవిని త్యాగం చేశారని చెప్పారు.

వయనాడ్‌ ప్రజలు రాహుల్‌ గాంధీ వైపు ఉన్నారని, తాను ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, కేవలం రాహుల్‌పై వయనాడ్‌ ప్రజల అభిమానాన్ని చూసేందుకే తెలంగాణ నుంచి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాము రాహుల్‌ని కోరామని, కానీ ఆయన వయనాడ్‌ వైపే మొగ్గు చూపారని చెప్పారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో 65 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి 75 శాతం ఓట్లు రావాలని ఆకాంక్షించారు. వారణాసి వర్సెస్‌ వయనాడ్‌ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.   

Advertisement
Advertisement