సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్‌లో తాను, సీఎం రేవంత్, హరీష్ రావు కూడా బాధితులేనని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, బండి సంజయ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి చర్చలో లేకుండా డైవర్ట్ చేశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చడానికి కరీంనగర్‌కు చెందిన మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. రాధాకిషన్ రావు చెప్పిన అంశాలను పోలీసులు రికార్డు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేను కూడా బాధితుడినే, నాతో పాటు రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే.
కరీంనగర్‌లో ప్రతిమ హోటల్‌లో 341 గదిలో ఉండి రాధా కిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావు ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా జరిగింది. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు వ్యవహారాలన్నీ అశోక్ రావు చూస్తున్నారు. రాజేందర్ రావుకు కాంగ్రెస్ టికెట్ రావడానికి ప్రధాన కారణం మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. కరీంనగర్ మంత్రి ద్వారా మధ్యవర్తిత్వం వర్తించారు. కోట్ల రూపాయల నిధులు చేతులు మారాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలకు కూడా పైసలు ఇచ్చారు. ప్రభాకర్ రావు వియ్యంకుడు అశోక్ రావును ఇతర మంత్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్లను ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా పెట్టుకున్నారా?. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. అమెరికాలో అశోక్ రావు కూతురు ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటున్నారు. ఇక్కడ అశోక్ రావు ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటున్నారు. నయీం కేసు మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కారుస్తున్నారు.
ప్రభాకర్ రావు ఇచ్చిన డబ్బులు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీ వరకు ముట్టాయి. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలి. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో జరిగిన తతంగం రేవంత్ రెడ్డికి తెలియకవచ్చు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది. కరీంనగర్‌తో పాటు ఇతర లోక్‌సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపినట్లు అనుమానం వస్తుంది’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment