
శ్రీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇప్పటికి రెండు దశల్లో పూర్తయింది. ఈనెల 7న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు, ఐదో దశల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ 'ఒమర్ అబ్దుల్లా' జమ్మూ కాశ్మీలోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ షమ్మీ ఒబెరాయ్, జమ్మూ & కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీఎన్ మోంగాతో పాటు ఒమర్ అబ్దుల్లా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈయన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్‌తో పోటీపడనున్నట్లు తెలుస్తోంది. పీడీపీ ఈ స్థానం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్‌ను బరిలోకి దింపింది.

నామినేషన్ వేయడానికి మే 3 చివరి తేదీ. కాగా మే 20న పోలింగ్ జరగనుంది. బారాముల్లాలో విలేకరులతో మాట్లాడుతూ.. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంటే.. తాను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు.
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టారు.