స్వ‘ప్రజాగళం’తో కూటమి ఉక్కిరిబిక్కిరి  | Sakshi
Sakshi News home page

స్వ‘ప్రజాగళం’తో కూటమి ఉక్కిరిబిక్కిరి 

Published Wed, Mar 20 2024 5:20 AM

Kadiri groups protest at Babus residence in Undavalli - Sakshi

రగులుతున్న టికెట్ల రగడ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఉండవల్లిలోని బాబు నివాసం వద్ద కదిరి శ్రేణుల నిరసన 

హైదరాబాద్‌లోని ఇంటి వద్దా ఆలూరు కార్యకర్తల హల్‌చల్‌

సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ)/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సీతంపేట(విశాఖ ఉత్తర): తెలుగుదేశం పార్టీలో సీట్ల మంటలు ఆరడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ఆ పార్టీ అట్టుడుకుతోంది. నియోజకవర్గాల్లోనే కాకుండా చంద్రబాబు ఇళ్ల వద్దకు కూడా వచ్చి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం ఉండవల్లి, హైదరాబాద్‌లలోని చంద్రబాబు ఇళ్ల వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన గళం విప్పారు కర్నూలు జిల్లా ఆలూరు సీటును కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమె మద్దతుదారులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు.

ఆలూరు సీటును బయట వ్యక్తులకు ఇస్తే అంగీకరించేది లేదని హెచ్చరించారు. బాబును కలిసి తమ ఆవేదనను తెలుపుతామని లోపలకు పంపాలని గొడవ చేశారు. పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో వారు సుజాతమ్మకే ఆలూరు సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఉండవల్లి నివాసం వద్ద కూడా కదిరి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మాజీ ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని, ఐదేళ్లు ఆయన నియోజకవర్గంలోనే ఉండి పని చేశారని, ఇప్పుడు వేరే వారికి సీటు ఎలా ఇస్తారని నిలదీశారు. కదిరి అసెంబ్లీ సీటు ఇవ్వలేనప్పుడు హిందూపురం ఎంపీ స్థానమైనా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో కనీసం లోకేశ్‌ను కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొందరిని లోపలకు పంపించారు. ఆయన వారితో సరిగా మాట్లాడకుండానే తిప్పి పంపించివేశారు.

లోకేశ్‌ను కలిసిన కోడెల శివరామ్‌
ఉమ్మడి గుంటూరు జిల్లా నేత కోడెల శివరామ్‌ ఉండవల్లిలో మంగళవారం టీడీపీ నేత లోకేశ్‌ను కలిశారు. ఆయనకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరించడంతో కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు పిలిచిన లోకేశ్‌ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఇస్తామని సముదాయించారు. అయితే శివరామ్‌ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం.   

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. నేనే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌పై పలువురు జనసైనికులు, వీరమహిళలు మండి­పడుతున్నారు.

మంగళవారం నియోజకవర్గ పరిధిలో వంశీకృష్ణ శ్రీనివాస్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. వంశీ వద్దంటూ నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. కార్పొరేటర్‌ మహ్మద్‌ సాధిక్‌కుగానీ, డాక్టర్‌ మూగి శ్రీనివాసరావులలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

 పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకేనని అధిష్టానం తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీలోని ఆశావహులంతా ఒక్కటై తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా సమ్మతమేనని, బీజేపీకి మాత్రం సీటు వదలొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై బాబును కలవాలని విజయ­వాడ వెళ్లి అధినేత దర్శనభాగ్యం కోసం ఐదురోజులుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. ఇంకా సీటుపై సందిగ్ధం వీడకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.   

 విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన బలప్రదర్శన చేస్తోంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కంటే తానే బలమైన అభ్యర్థినంటూ సీటు దక్కించుకోవడానికి జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి పసు­పులేటి ఉషాకిరణ్‌ పావులు కదుపుతున్నారు.

ఇటీవల ఆ పార్టీ ముఖ్య నాయ­కులు సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి  కేటాయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి గత ఎన్ని­కల్లో నోటా కంటే తక్కువే ఓట్లు వచ్చాయని, తనకు మెరుగైన ఓట్లు వచ్చాయని ఉషాకిరణ్‌ వాదిస్తున్నారు. సీటు విషయం పునరాలోచించాలని పార్టీకి లేఖ రాశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement