Sakshi News home page

కాంగ్రెస్‌లోకి కడియం.. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిపై ట్విస్ట్‌

Published Fri, Mar 29 2024 1:24 PM

kadiyam kavya will contest warangal lok sabha on congress ticket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మరో సీనియర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. 

కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అ‍య్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్‌ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్‌ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్‌ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు.

కావ్య పేరు దాదాపు ఖరారు
ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే.. వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ సీటును కావ్య వద్దని చెబుతూ.. కేసీఆర్‌కు లేఖ రాసింది. మరోవైపు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరతుందనే ప్రచారం తెర మీదకు రాగానే.. వరంగల్‌ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్‌ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వీళ్లు చేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

రేవంత్‌తో కేకే భేటీ
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో చేరతానని అధికారికంగా గురువారం ప్రకటించిన సీనియర్‌ నేత కేకే.. ఈ  ఉదయం పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరికపై అరగంట పాటు వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కుదిరితే రేపు.. లేకుంటే ఏప్రిల్‌ 6వ తేదీన కేకే కాంగ్రెస్‌ గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement