ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ముస్లిం నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అరిఫ్ ఖాన్ లేఖ రాశారు. ప్రతిపక్ష కూటమి మమా వికాస్ అఘాడీ కూటమి ముస్లిం అభ్యర్ధిని నిలబెట్టనందుకు లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయలేనని లేఖలో తేల్చి చెప్పారు.
‘మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎంవీఏ కూటమి ఒక్క ముస్లిం అభ్యర్ధికి కూడా అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం అనేక ముస్లిం సంస్థలు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్లు మైనారిటీ కమ్యూనిటీ నుంచి కనీసం ఎక్క నేతనైనా అభ్యర్ధిగా ఆశిస్తారు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు.
పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నన్ను ‘కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు కావాలి, కాని అభ్యర్థులు ఎందుకు వద్దు’ అని అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేస్తున్నాను’ అని ఖాన్ లేఖలోపేర్కొన్నారు.
కాగామహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో, శివసేన (ఉద్దవ్), ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్)తో కలిసి పోటీ చేస్తోంది. అయితే ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించారు. కానీ నగర యూనిట్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్‌ను ఖరారు చేసింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని చండీవాలి నుంచి పోటీ చేసిన ఖాన్.. కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
చదవండి: ఆ పోలింగ్ బూత్‌లో జీరో ఓటింగ్.. కారణమిదే?
Comments
Please login to add a commentAdd a comment