కుటుంబంలో చిచ్చుపెట్టారు | Sakshi
Sakshi News home page

కుటుంబంలో చిచ్చుపెట్టారు

Published Sat, May 4 2024 5:19 AM

Mudragada on the video released by daughter Kranti

అయినా భయపడేది లేదు

కుమార్తెతో ఆమె మామ, జనసేన నేతలు మాట్లాడించారు 

పెళ్లయ్యాక మెట్టినింటి మనిషి

జగన్‌కు తోడుగా ఉండటానికే వైఎస్సార్‌సీపీలో చేరా

సీఎం సంక్షేమ పథకాలు పేదలకు ఊపిరి పోశాయి

కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ముద్రగడ 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టి తనను బెదిరిస్తే బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ఆయన శుక్రవారం పిఠాపురంలో మీడియా సమావేశంలో స్పందించారు. వివాహమైన రోజు నుంచే తన కుమార్తె మెట్టినింటి మనిషయ్యిందన్నారు. 

పెళ్లిగాక ముందు వరకే తమ మనిషి అని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. తన కుమారులు మాత్రమే తన మనుషులన్నారు. తన కుమార్తె మామ, జనసేన నాయకులు ఆమెతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు బెదిరించినా బెదిరేది లేదని చెప్పారు. ఇలా తిట్లు తిట్టించడం వల్ల తనకు బాధ లేదని, అయితే రాజకీయం రాజకీయమే అని తెలిపారు.

కుటుంబంలో చిచ్చుపెట్టిన వారికి ఆ భగవంతుడే సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడని చెప్పారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు కూడా తన కుమార్తె మామ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తుచేశారు. నాటినుంచి నేటివరకు వారు తనకు ఏ విషయంలోను, ఏ రోజూ సహక రించలేదని తెలిపారు. 

పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు
తాను 40 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, కుట్రలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ అలవాటయ్యాయన్నారు. తన తండ్రి ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అందుకే తాను ఈ రోజుకీ ఎవ్వరికీ భయపడకుండా, ఎవరి చేతి కిందా బతకకుండా ఉంటున్నానన్నారు.

 తాను ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి పదవులు కావాలని, ఉన్నతస్థానాలు, హోదాలు కల్పించాలని అడగలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించాలని తాను వైఎస్సార్‌సీపీలో చేరినప్పటి నుంచీ తనవంతు కష్టపడుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇటువంటి కుట్రలు పన్నడం రాజకీయాల్లో సహజమేనన్నారు.

ఇటువంటి పథకాలు ఇచ్చే నాయకుడు భవిష్యత్‌లో పుట్టడు 
తాను ఒకసారి వైఎస్సార్‌సీపీలో చేరాక,  ఇక పక్కచూపులు చూసేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ 
జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ఉండటానికే తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చానన్నారు. ఎవరెన్ని అనుకున్నా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పునరుద్ఘాటించారు. జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఊపిరి పోస్తున్నాయన్నారు.

వైఎస్‌ తనయుడు జగన్‌ పేదల పెన్నిధిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడేదన్నారు. పేదల కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు భవిష్యత్తులో పుట్టడన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని స్పష్టం చేశారు. 

ప్రజల కోసం నిత్యం పరితపించే జగన్‌కు తోడుగా అన్ని వర్గాలు నిలవాలని కోరారు. కూటమి ప్రజాసేవ కోసం వస్తున్నది కాదని, కేవలం అధికార దాహం తీర్చుకునేందుకు మాత్రమే వస్తోందని చెప్పారు. షూటింగ్‌ల కోసమే పవన్‌కు ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడుపోయే కులమని పవన్‌కళ్యాణ్‌ అన్న మాటలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.  

Advertisement
Advertisement