రిటైర్‌మెంట్‌కి కొందరు ఎప్పటికీ ఇష్టపడరు: అజిత్ పవార్ | Sakshi
Sakshi News home page

రిటైర్‌మెంట్‌కి కొందరు ఎప్పటికీ ఇష్టపడరు: అజిత్ పవార్

Published Sun, Jan 7 2024 9:23 PM

Some Not Ready To Retire Ajit Pawar Targets Sharad Pawar - Sakshi

ముంబయి: ఎన్సీపీలో అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. పార్టీలో ఉన్నత పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి శరద్ పవార్ కట్టుబడి ఉండనందుకు తాను ఇప్పటికీ కలత చెందుతున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి అన్నారు. నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత కూడా పదవీ విరమణ చేయడానికి కొంతమంది ఇష్టపడరు అని శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్ పవార్ అన్నారు.

"ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రజలే ఆపాలి. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. వినడానికి సిద్ధంగా లేని కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాల పట్ల మొండిగా ఉంటారు.  60 ఏళ్ల తర్వాత, కొందరు 65 ఏళ్ల వయస్సులో, కొందరు 70 ఏళ్లలో, మరికొందరు 80 ఏళ్లలో పదవీ విరమణ చేస్తారు. కానీ 80 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఓ వ్యక్తి పదవీ విరమణకు సిద్ధంగా లేరు" అని అజిత్ పవార్ అన్నారు.

"ఏం జరుగుతోంది? మేము పని చేయడానికే ఇక్కడ ఉన్నాం. ఎక్కడైనా తప్పు జరిగితే మాకు తెలియజేయండి. మాకు చాలా సత్తా ఉంది. నేను రాష్ట్రానికి చాలాసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాను. మేము అనేక పథకాలను విజయవంతం చేశాము" అని పరోక్షంగా శరద్ పవార్‌ను ఉద్దేశించే అజిత్ పవార్ అన్నారు.

ఎన్సీపీలో అత్యున్నత పదవుల విషయంలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. శరద్ పవార్ అధ్యక్ష పదవి నుంచి తొలగినట్లే తొలగి మళ్లీ అధిష్టించారు. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంతో కలిసిపోయారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీ పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్‌ వద్ద సవాలు చేశారు. ఈ పరిణామాల మధ్య అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య రాజకీయ వివాదం నడుస్తోంది. 

ఇదీ చదవండి: TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే..

Advertisement
 
Advertisement