Kanigiri Radha Murder: Police Say Husband Strangled Her, Tried To Make It Appear Like Road Accident - Sakshi
Sakshi News home page

రాధ మర్డర్‌.. ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు..

Published Tue, May 23 2023 7:33 AM

- - Sakshi

కనిగిరి రూరల్‌: వివాహిత రాధ హత్య కేసు.. అంతా థ్రిల్లింగ్‌.. సస్పెన్స్‌..ఎన్నో ట్విస్టులు.. పోలీసులకు సవాల్‌గా నిలిచింది. అవసరాల కోసం డబ్బును అప్పుగా తీసుకున్న స్నేహితుడే హత్య చేశాడని తొలుత ప్రచారం..ప్రాథమికంగా లభించిన ఆధారాలతో పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు..రెండు రోజుల పాటు ఏవేవో ప్రచారాలు..కిరాయి హంతకులపైనా ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.. కొత్త సెల్‌సిమ్‌ ఆధారంగా సాగిన దర్యాప్తులో ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త ట్విస్ట్‌.. స్నేహితుడు కాదు భర్తే హత్య చేశాడని తేలింది. అందరూ షాక్‌కు గురయ్యారు. స్నేహితుడి ముసుగులో చాట్‌ చేసి..ఎవరికీ అనుమానం రాకుండా సీన్‌ క్రియేట్‌ చేసి.. రాధను అంతమొందించాడు.. ఈ ఘటనలో ‘సాక్షి’ కథనాలు అక్షర సత్యాలుగా నిలిచాయి. రాధ దారుణ హత్య ఘటనలో సీన్‌..టు సీన్‌ ఇలా..

► వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన మేడం సుధాకర రెడ్డి కుమార్తె రాధకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మండల కేంద్రం కోదాడకు చెందిన కోట కృష్ణా రెడ్డి కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోట మోహన్‌ రెడ్డితో వివాహమైంది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన కాశిరెడ్డి, రాధ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు..కాశిరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యాపారం నిమిత్తం వీరి ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. వీరి వద్ద సుమారు రూ.1.27 కోట్లు అప్పు చేశాడు. అప్పు తీర్చకపోవడం..ఐపీ నోటీస్‌ పంపడంతో రాధ, మోహన్‌రెడ్డిల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.. రాధపై అనుమానం పెంచుకుని హత్య చేసేలా కక్ష పెంచుకున్నాడు..పథకం ప్రకారం పక్కాగా వ్యవహరించాడు.

రాధ ఊర్లో జరిగే అమ్మవారి కొలువులే తన పథకానికి అనుకూలంగా మార్చుకున్నాడు..స్నేహితుడి పేరుతో సిమ్‌లు మారుస్తూ భార్యతో చాటింగ్‌ చేశాడు..కాశిరెడ్డి డబ్బు ఇస్తాడంటూ 17వ తేదీ సాయంత్ర రాధ జిల్లెళ్లపాడుకు వెళ్లింది. చిన్న కొడుకుని బాబాయ్‌ ఇంట్లో దించి. బజారులో షాపింగ్‌ చేసింది. రాత్రి ఏడుగంటల వరకూ సీసీ కెమెరాల్లో రాధ కదలికలు కనిపించాయి. పామూరు బస్టాండ్‌లో ఉన్న సమయంలో వచ్చిన కారు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. రాత్రి రాధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి 12.50కి ఫోన్‌ లొకేషన్‌ గుర్తించారు. జిల్లెళ్లపాడు అడ్డరోడ్డు వద్ద రాధ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు ఇస్తానని స్నేహితుడు కాశిరెడ్డి చెప్పడంతో రాధ కనిగిరికి వెళ్లిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కాశిరెడ్డే స్నేహితురాలు రాధను హత్య చేశాడని అందరూ భావించారు. పోలీసులు సైతం ఆ దిశగా దర్యాప్తు చేశారు. కేసులో ఎలాంటి పురోగతి లేదు. 17వ తేదీ మధ్యాహ్నం రాధ భర్త, కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని కోదాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మోహన్‌రెడ్డి కూడా ఏమీ తెలియనట్టుగా పాల్గొన్నాడు.. ఎవరూ అనుమానం రాకుండా అతను కూడా కాశిరెడ్డిపైనే ఆరోపణలు చేశాడు.

18వ తేదీన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త సిమ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సిమ్‌ హతురాలు రాధ భర్త మోహన్‌రెడ్డిదిగా గుర్తించారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడి పోయింది. మరో మూడు రోజుల పాటు లోతుగా దర్యాప్తు చేశారు. అందరూ షాక్‌కు గురయ్యే విషయాలు వెల్లడయ్యాయి. స్నేహితుడికి డబ్బుసాయం సంసారంలో చిచ్చురేపింది. అది అనుమానంగా మారి హత్యకు దారి తీసింది.

విచారణలో తేలిందిలా..
రాధను హత్య చేసేందుకు పన్నాగం పన్నిన మోహన్‌రెడ్డి.. కాశిరెడ్డి పేరుతో ఫేక్‌ మెసేజ్‌లు పెట్టి చాటింగ్‌ చేసి నిర్ధారించుకుని, 13వ తేదీ కనిగిరికి ఒంటరిగా రావాలని మెసేజ్‌ పెట్టాడు. రాధ దానికి పూర్తిగా స్పందించలేదు.

తిరిగి 15వ తేదీ మళ్లీ ఫేక్‌ మెసేజ్‌లతో చాటింగ్‌ చేశాడు. (హైదరాబాద్‌లోని మార్గ మధ్యంలో సంగారెడ్డి నుంచి పఠాన్‌ చెరువుకు వెళ్లే దారిలో చెరుకు రసం అమ్మే మహిళ ఫోన్‌ తీసుకున్నాడు. ఆ ఫోన్‌లోని సిమ్‌ను తస్కరించి.. కాశిరెడ్డి చేసినట్లు ఫోన్‌ మెసేజ్‌ చాటింగ్‌ చేశాడు)

16న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో లాంగ్‌ డ్రైవ్‌ రెంటెడ్‌కార్‌ను తీసుకున్నాడు. కనిగిరిలో కలుద్దాం రమ్మని కాశిరెడ్డిలా రాధకు మెసేజ్‌లు పెట్టాడు. రాత్రికి ఒంగోలులో బసచేశాడు.

17న ఒంగోలు నుంచి మోహన్‌రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు కనిగిరికి చేరాడు.

ఈ మధ్యలో భార్య రాధతో కాశిరెడ్డిలా మోహన్‌రెడ్డి ఫోన్‌ మెసేజ్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాధ సాయంత్రం 6 గంటలకు కనిగిరి వచ్చింది.

గం.6.47 కు రాధ ఉన్న స్థలానికి భర్త మోహన్‌రెడ్డి కారులో వచ్చాడు. ఒక్క సారిగా కాశిరెడ్డి స్థానంలో భర్తను చూసిన రాధ అవాకై ్కంది. కొద్ది సేపటికి కారులో ఎక్కించుకున్నాడు.

ఆ తర్వాత రాధను కారులో తీసుకెళ్లిన భర్త మోహన్‌రెడ్డి .. ఎన్‌హెచ్‌ 565 రోడ్డు మాచవరం సమీపంలోని డిగ్రీ కళాశాల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో రాధకు బాబాయి, నాన్న దగ్గర నుంచి పలు ఫోన్లు వచ్చాయి. అయినా లిఫ్ట్‌ చేయలేదు. అక్కడ ఇద్దరికీ కారులో వాగ్వాదం జరిగింది.

సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఒక్కసారిగా రాధపై భర్త మోహన్‌రెడ్డి దాడి చేసి చున్నీతో గొంతు నులిమి, గట్టి కొట్టి చంపాడు.

11 గంటల సమయంలో అదే కారులో వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు సమీపంలో క్రాస్‌ రోడ్డు వద్దకు తీసుకెళ్లి పడేశాడు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారును భార్య శవంపై ఎక్కించాడు.

రాధను హత్య చేసిన భర్త ఒంటిపై బంగారు నగలను సైతం తీసుకుని వెళ్లాడు.

కారును పూర్తిగా శానిటైజర్‌తో కడిగి మరీ.. అత్యతంగా వేగంగా మిర్యాలగూడ చేరాడు. తిరిగి మరో కారులో తల్లిదండ్రులతో 18న కనిగిరికి చేరా డు. అమాయకంగా వ్యవహరించి, కాశిరెడ్డినే తన భార్యను చంపినట్లు అందర్నీ నమ్మించాడు. కోదాడ స్వగ్రామం తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశాడు.

19వ తేదీ రాత్రికి సాంకేతిక ఆధారంగా, ఐటీ కోర్‌ టీం, దర్యాప్తు బృందాల సమాచారంతో కేసు మలుపు తిరిగింది. అదే రోజు భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

20, 21 తేదీల్లో సమగ్ర విచారణతో భర్త మోహన్‌రెడ్డి ఒక్కడే భార్య రాధను హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

చివరకు మోహన్‌రెడ్డి వాడిన సిమ్‌కార్డే అతడిని పట్టింది. మిస్టరీ వీడిపోయింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement