సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్‌ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.
రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment