న్యూజిలాండ్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’! | Sakshi
Sakshi News home page

NZ Vs SA Day 2: న్యూజిలాండ్‌కు షాక్‌.. మొన్న ఒక్కడే 240.. కానీ ఇప్పుడు!

Published Wed, Feb 14 2024 12:11 PM

NZ Vs SA 2nd Test Day 2: New Zealand Horrific Collapse 211 All Out - Sakshi

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్‌ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

హామిల్టన్‌ టెస్టులో కివీస్‌ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్‌ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్‌ టిమ్‌ సౌతీతో పాటు మ్యాట్‌ హెన్రీ, వాగ్నర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు.

కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ 43 పరుగులతో కివీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్‌ యంగ్‌(36), నీల్‌ వాగ్నర్‌(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు.

ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్‌ స్పిన్నర్‌ డేన్‌ పీడ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్‌ డేన్‌ పీటర్సన్‌ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్‌ మొరేకికి ఒక వికెట్‌ దక్కింది. 

కాగా తొలి టెస్టులో ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్‌ డబుల్‌ సెంచరీ, విలియమ్సన్‌ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్‌. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్‌ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్‌ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం.

చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!

Advertisement
Advertisement