దమ్ముంటే అరెస్ట్ చేయండి
మోదీకి కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చాక ఆప్ ఎన్నికల ప్రచారపర్వంలో ఎన్నికల వేడిని రాజేసిన కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీకి కొత్త సవాల్ విసిరారు. తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీజీ మీరు కొత్తరకం జైలు ఆట ఆడుతున్నారని తెలుసు.
మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ ఇలా ఆప్ నేతలను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపిస్తున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు నేను, నాతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వస్తాం. ఎంత మందిని అయితే మీరు జైలులో పడేద్దామనుకుంటున్నారో అంత మందిని ఒకేసారి అరెస్ట్‌చేసి జైల్లో వేసేయండి’’ అని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
‘ సంజయ్ సింగ్‌ను చెరసాలలో వేశారు. ఈరోజు బిభవ్ కుమార్‌ను అరెస్ట్‌చేశారు. కంటికి శస్త్రచికిత్స తర్వాత మా ఎంపీ రాఘవ్ చద్దా లండన్ నుంచి తిరిగొచ్చారు. ఆయనను కూడా జైలుకు పంపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్‌లనూ కారాగారంలో వేస్తామని గతంలో బీజేపీ వెల్లడించింది’ అని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ ఒక వీడియోను షేర్‌చేశారు.
డ్రామాలు ఆపండి: బీజేపీ
బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ స్పందించారు. ‘‘ ఈ డ్రామాలు ఆపండి. మేం చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాం. మీ సొంతిట్లో మీ పార్టీ ఎంపీని చితకబాదితే ఆరు రోజులైనా మీరు మౌనం వీడట్లేరు. మహిళా ఎంపీపై దాడి ఉదంతంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంపై మీరెందుకు స్పందించట్లేరు? చర్యలెందుకు తీసుకోవట్లేరు?’’ అని సచ్‌దేవ్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment