ఉన్నత విద్య కోర్సుల్లో మార్పులు.. ఆనర్స్‌కు అత్యధిక ప్రాధాన్యం
కొత్తగా బయోమెడికల్ కోర్స్... కామర్స్‌కి కమర్షియల్ లుక్
ఎంకామ్‌లో సరికొత్త స్టాటిస్టిక్స్ .. మార్కెట్ వర్గాలతో భాగస్వామ్యం
ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఆయా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా డిగ్రీ, పీజీ కోర్సులను తీర్చిదిద్దాలని యూజీసీ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పలు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులు తీసుకొస్తున్నారు.
తాజాగా బీఎస్సీలో బయో మెడికల్ కోర్సును, బీకాంలో ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ కోర్సులను పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఏ ఆనర్స్‌లోనూ ఎనలైటికల్ కంప్యూటర్స్ కోర్సులను తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. విస్తరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు బయో మెడికల్ కోర్సు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ తర్వాత చేసే పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ స్కిల్ ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నారు.
ఎమ్మెస్సీ డేటా సైన్స్‌లో మార్పులు..
» పీజీ కోర్సులకు జవసత్వాలు అందించే యోచనలోనూ కసరత్తు జరుగుతోంది. ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. పుస్తకాల ద్వారా సంపాదించే పరిజ్ఞానం తగ్గించి, పరిశ్రమల్లో నేరుగా విజ్ఞానం పొందే విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నారు.
పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి ఆయా విద్యార్థులు వెళ్లేలా నూతన విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై ఈ విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది.
ఉపాధే లక్ష్యంగా...
» కొన్నేళ్లుగా విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రల్లోని డీమ్డ్ వర్సిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్థిరపడుతున్నారు.
ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, హానర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు.
పోస్టు గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవని, లెక్చరర్‌గా వెళ్లేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన యువతలో ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్లడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పుడున్న సంప్రదాయ కోర్సులైన బీఏ కోర్సుల్లో చేరే వాళ్లే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్లాలనుకునే వారి సంఖ్య ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు ఇటువైపు వెళ్తున్నారు.
ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కనీ్వనర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు 20,484 మంది మాత్రమే. అందుకే ఇలాంటి కోర్సులను కొత్త పద్ధతుల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆకర్షితులవుతారనేది ఉన్నత విద్యా మండలి ఆలోచన. బీకాంలో కంప్యూటర్ అనుసంధానం చేయడం, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ రంగంలో ఉపాధి పోటీని నిలబెట్టుకునే కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిని ఆయా రంగాల్లో పరిశ్రమల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేలా మార్పులు తెస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment