హెచ్‌ఐవీ రోగులకు సత్వర వైద్యం | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ రోగులకు సత్వర వైద్యం

Published Sun, May 19 2024 5:40 AM

హెచ్‌

తణుకు సేఫ్‌కేర్‌ సెంటర్‌కు అందుబాటులోకి సీడీ ఫోర్‌ సేవలు

ప్రభుత్వం చొరవతో రూ.50 లక్షల విలువైన పరికరం ఏర్పాటు

గతంలో వారానికోసారి మాత్రమే పరీక్షలు.. నేడు ప్రతి రోజూ

ఉమ్మడి జిల్లాలో 5 చోట్ల అందుబాటులో సీడీ ఫోర్‌ పరికరాలు

తణుకులో సేవలు ప్రారంభించిన సూపరింటెండెంట్‌ అరుణ

తణుకు అర్బన్‌ : తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేఫ్‌ కేర్‌ సెంటర్‌కు రూ.50 లక్షల విలువైన సీడీ ఫోర్‌ పరికరం ఉన్న ప్రత్యేక ల్యాబ్‌ అందుబాటులోకి రావడంతో హెచ్‌ఐవీ రోగులకు మరింత సత్వర వైద్యసేవలు అందనున్నాయి. హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వెంటనే రోగి శరీరంలో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని మందులు వాడించే ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. వ్యాధి సోకిన వారి జీవిత కాలం పెంచే క్రమంలో ప్రతి రోగికి సీడీ ఫోర్‌ పరికరం ద్వారా వ్యాధి నిరోధక శక్తి కౌంట్‌ ఎంత ఉందో తెలుసుకోవడం ప్రధాన భూమిక. ఈ రక్తపరీక్షలో 350 కన్నా కౌంట్‌ తక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గుతున్నట్లుగా గుర్తించి క్రమం తప్పకుండా సంబంధిత మందులు వాడిస్తూ మూడు నెలలకోసారి సీడీ ఫోర్‌ పరీక్ష చేయిస్తూ ఉంటారు. ఆరోగ్యకరంగా ఉన్న వారిలో సుమారుగా 1400లుగా ఉండే ఈ కౌంట్‌ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లో మాత్రం తగ్గే పరిస్థితి ఉంటుంది. దీంతో వ్యాధిగ్రస్తులకు టీబీతోపాటు పలురకాల రోగాలు చుట్టేస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. సదరు కౌంట్‌ తెలుసుకుని మందులు వాడడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

గతంలో తాడేపల్లిగూడెం, ఏలూరు ఆస్పత్రుల్లో మాత్రమే సేవలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఆశ్రం ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో హెచ్‌ఐవీ బాధితులకు సేఫ్‌ కేర్‌ సెంటర్‌ల ద్వారా 22,592 మందికి వైద్యసేవలు అందుతున్నాయి. అయితే ఆశ్రం ఆస్పత్రి సెంటర్‌కు సంబంధించి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సెంటర్‌కు పంపిస్తున్నారు. తణుకు సేఫ్‌ కేర్‌ సెంటర్‌లలో ఈ పరికరం ఇప్పటివరకు అందుబాటులో లేదు. దీంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి తాడేపల్లిగూడెం, ఏలూరు సేఫ్‌ కేర్‌ సెంటర్‌లకు వారానికోసారి పరీక్షలకు పంపించే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా తణుకు సేఫ్‌ కేర్‌ సెంటర్‌లో పరికరం అందుబాటులోకి రావడంతో ఇకపై నిత్యం ఇక్కడ సీడీ ఫోర్‌ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు దక్కింది. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో) ద్వారా ఏలూరు, తాడేపల్లిగూడెం సేఫ్‌కేర్‌ సెంటర్‌లకు ఈ పరికరాలు అందుబాటులోకి రాగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జంగారెడ్డిగూడెం, భీమవరం సెంటర్‌లకు పరికరాలు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రోగుల సౌకర్యార్ధం రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రూ.50 లక్షల నిధులతో సమకూర్చిన సీడీ ఫోర్‌ పరికరం నెల క్రితమే కేంద్రానికి అందుబాటులోకి రాగా, ఆస్పత్రి ఆవరణలో ఎయిర్‌ కండిషన్‌తో ప్రత్యేక ల్యాబ్‌ రూమ్‌కు అన్ని వసతులు కల్పించి పరీక్షలు ప్రారంభించారు. దీంతో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు మరింత సత్వర సేవలు అందనున్నాయి.

ఇక ప్రతిరోజూ పరీక్షలు

హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల రోగ నిరోధక శక్తి సామర్థ్యాన్ని తెలిపే సీడీ ఫోర్‌ పరికరం తణుకు సేఫ్‌ కేర్‌ సెంటర్‌కు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెలగల అరుణ అన్నారు. తణుకు ఆస్పత్రి ఆవరణలో ఉన్న సేఫ్‌ కేర్‌ సెంటర్‌లోకి అందుబాటులోకి వచ్చిన సీడీ ఫోర్‌ పరికరాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు సీడీ ఫోర్‌ పరీక్షలు ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు రక్తనమూనాలు తీసుకు వెళ్లి పరీక్షలు చేయిస్తున్నారని పరికరం అందుబాటులోకి రావడంతో ఇకపై ఏ రోజుకారోజే పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. తణుకు ఆస్పత్రి ఆవరణలో ఉన్న సేఫ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు ఎంతో సౌకర్యవంతమైన వైద్యసేవలు అందుతున్నాయని, ఈ పరికరం ద్వారా వచ్చే కౌంట్‌ను బట్టి రోగులకు చికిత్స అందించనున్నారని చెప్పారు. ఈ రక్త పరీక్షల కోసం ఆస్పత్రి ఆవరణలోని భవనాన్ని కేటాయించి పూర్తి ఎయిర్‌ కండిషన్‌ ల్యాబ్‌ విభాగంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సేఫ్‌ కేర్‌ సెంటర్‌ వైద్యాధికారి డాక్టర్‌ సుంకవల్లి రామకృష్ణ, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పుప్పాల రాజరాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు చక్రధరరావు, శారద, చక్రవర్తి, దుర్గాప్రసాద్‌, సాయిబాలాజీ, రఘువీర్‌, పీపీ యూనిట్‌ వైద్యాధికారి డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు, వైద్యులు ఉషారాణి, సేఫ్‌కేర్‌ సెంటర్‌, ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్‌ఐవీ రోగులకు సత్వర వైద్యం
1/1

హెచ్‌ఐవీ రోగులకు సత్వర వైద్యం

Advertisement
 
Advertisement
 
Advertisement