పదేళ్లలో రాష్ట్రం నుంచి భారీగా ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు
ఎగుమతులు రూ. 11,185 లక్షల కోట్లు..
54.47 లక్షల ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.57,258 కోట్లతో మొదలైన ఎగుమతులు.. 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్లలో నమోదైన ఐటీ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022–23లో దేశంలో ఐటీ ఎగుమతులు 9.36 శాతం వృద్ధి చెందగా.
అదే ఏడాది తెలంగాణలో 31.44 శాతం పెరిగాయి. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల కాలంలో (2014–23) రూ.11.85 లక్షల కోట్ల ఎగుమతులు సాధించగా.. 54.47 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..: తెలంగాణ ఏర్పడక ముందు దేశవ్యాప్తంగా ఐటీలో 32.90 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83 శాతం. అంటే 3,23,396 ఉద్యోగులున్నారు. గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 21.10 లక్షల మంది ఉద్యోగులు చేరగా.. రాష్ట్రంలోనే కొత్తగా 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
బ్రాండ్ హైదరాబాద్!
ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరులో ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. గతేడాది ఉద్యోగ కల్పనలో భాగ్యనగరం గార్డెన్ సిటీ బెంగళూరుని దాటేసింది. కొత్తగా దేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు రాగా.. హైదరాబాద్‌లో 1.50 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. అదే బెంగళూరులో 1.46 లక్షల జాబ్స్ సృష్టించినట్లు నాస్కామ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ హైదరాబాద్ 2022 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో బెంగళూరును అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇక వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డ్రోన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం అనేక నూతన పాలసీలకు రూపకల్పన చేసింది. ఐటీ రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్యం ప్రోత్సహించే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ విజయం సాధించడంతో, మహిళల కోసం ప్రత్యేకంగా ‘వి హబ్’ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది.
ద్వితీయ శ్రేణి పట్టణాలకూ ఐటీ.. జిల్లాల్లో ఐటీ టవర్లు
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కావడంతో నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీతో ఉప్పల్, పోచారం, కండ్లకోయ, శంషాబాద్ ప్రాంతాల్లోనూ కొత్త ఐటీ టవర్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ యువతకు స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కలి్పంచాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోనే ఐటీ టవర్లను నిర్మించింది.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్లలో పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2019లో వరంగల్‌లో తొలి ఐటీ టవర్ ప్రారంభం కాగా.. ఇందులోని టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ వంటి 10 కంపెనీల్లో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగం పురోగతి, ప్రోత్సాహానికి సంబంధించి ఇప్పటివరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ ప్రకటించలేదు. రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment