Live Updates..
👉 పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్చపై దాడి జరిగింది.
పాలనను ప్రజల వద్దకు తెచ్చాం.
మన సంస్కృతి, చరిత్ర గొప్పది.
ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం.
తల్లిని ఆహ్వానించేందుకు అనుమతి కావాలా.
తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా, మన్మోహన్‌కు కృతజ్ఞతలు.
ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది.
బానిసత్వాన్ని తెలంగాణ భరించదు.
ముళ్ల కంచెలు, ఇనుప గోడలను తొలగించాం.
సచివాలయానికి సామాన్యుడు వచ్చేలా చేశాం.
గత పదేళ్లలో స్వేచ్చపై దాడి జరిగింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి.
తెలంగాణ వచ్చి పదేళ్ల అయినా ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నాను.
రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి.
చిహ్నం ఓ జాతి చరిత్రకు అద్దం పడుతుంది.
రాష్ట్ర అధికారిక చిహ్నన్ని రూపొందించే పనిలో ఉన్నాం.
ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చాం.
ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తరహాలో అమలు చేస్తాం.
👉నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
👉స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు.
"ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం" అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు.
👉డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి... ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
👉 ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత.
👉జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం. తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం.
👉 పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. భౌతిక విధ్వసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. ఇది గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
👉 తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియాగాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఏ హెూదాలో సోనియాగాంధీ గారిని ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాలా?! తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?! ఏ హెదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం.
👉 దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో... అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
1. సాంస్కృతిక పునరుజ్జీవనం
2. ఆర్థిక పునరుజ్జీవనం
ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
👉ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు... సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు... భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి.
👉తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన.. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..." గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన "జయ జయహే తెలంగాణ..." గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు.
👉 చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం.
👉 అదే విధంగా.. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా TG ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమ సమయంలో TG నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారు. యువత తమ గుండెలపై TG అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు TS స్థానంలో TG ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
👉జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే... మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే... తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి... కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం.
ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.
👉ఆర్థిక పునరుజ్జీవనం :
రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉంది. మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉంది. శాసనసభలో శ్వేత పత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నాం..
👉గ్రీన్ తెలంగాణ 2050
స్వల్పకాలిక ఆలోచనలు కాదు... దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు "గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి... ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.
👉 మూసీ సుందరీకరణ..
మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
👉 డ్రగ్స్ పై ఉక్కు పాదం...
తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు... వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.
👉ఇది ప్రజా పాలన..
పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటీ 28 లక్షల మంది ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది.
👉48 గంటల్లో రెండు గ్యారెంటీలు..
అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాం.
రాజీవ్ ఆరోగ్య శ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ 9, 2023 నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.
ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది... పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.
విద్యారంగ ప్రక్షాళన
తెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది.
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాం.
👉రైతును రాజును చేయడం మా సంకల్పం
రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం.
👉విద్యుత్ సరఫరాలో రికార్డు బ్రేక్
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6 న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. రికార్డు సృష్టించాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.
👉 తెలంగాణకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు..
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
తెలంగాణ అమరవీరులకు నివాళులు
పదేళ్ల కిందట మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ కల నిజమైంది
ప్రజా తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నాం
అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత సాధించడమే లక్ష్యం
👉 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా సందేశం..
సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేసిన ప్రభుత్వం.
సోనియా గాంధీ కామెంట్స్..
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది.
తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యం.
తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో వెనుకడుగు వేయదు.
👉పరేడ్ గ్రౌండ్లో కోలాహలం..
పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
హాజరైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల నేతలు
వేడుకలకు అమరుల కుటుంబ సభ్యులను పిలిచిన ప్రభుత్వం
పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ అధికారులు
పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
👉అమరులకు సీఎం రేవంత్ నివాళులు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు.
👉తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు
కేటీఆర్ కామెంట్స్..
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి.
సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదు.
ఛత్తీస్‌గఢ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రి
కానీ పది సంవత్సరాల తెలంగాణను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం రేవంత్.
తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు.
రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రి
ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు.
👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…
ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి.
ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…
“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…
ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…
విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…
అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…
ఆ పిడికిలి విప్పిచూస్తే…
త్యాగం…
ధిక్కారం…
పోరాటం కనిపిస్తాయి.
ఆ స్ఫూర్తితో…
ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…
“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…
ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…
విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…
అందరికి… pic.twitter.com/09sJMwlyFN— Revanth Reddy (@revanth_anumula) June 2, 2024
తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు
అసెంబ్లీ కౌన్సిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
👉 తెలంగాణ సెక్రటేరియట్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ శాంతకుమారి,
పాల్గొన్న ముఖ్య కార్యదర్శిలు కార్యదర్శిలు అధికారులు సిబ్బంది
గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..
హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్.
జాతీయ జెండా ఎగరేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు.
కాసేపట్లో గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు..
గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అరిపించనున్న కాంగ్రెస్ నేతలు..
👉 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్
13 ఏండ్ల ఉద్యమంతో స్వప్నం సాకారం..
10 ఏండ్ల కేసీఆర్ పాలనతో ప్రగతి వికాసం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయోజనాలను, పదేండ్ల ప్రగతి పాలన ఫలాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమ పంథాకు సిద్ధమవుదాం
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ ✊… pic.twitter.com/WAmTHKgCEe— BRS Party (@BRSparty) June 2, 2024
👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.
👉 ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు.
👉 ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.
👉 అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment