ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు.. వేగంగా కదులుతున్న రుతుపవనాలు
కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం
రానున్న 3 రోజులు వానలు
అక్కడక్కడ భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయి. నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.
మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఆదివారం అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున వడగాడ్పుల ప్రభావం చాలా వరకు తగ్గింది.
రాజంపేటలో 32.5 మిల్లీమీటర్ల వర్షం
ఇదిలావుండగా శనివారం సాయంత్రానికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2, చిత్తూరులో 21, తవణంపల్లెలో 18.7, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2, అల్లూరి జిల్లా కొయ్యూరులో 17.7, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment