వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
60 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు
టీమిండియా సమష్టి ప్రదర్శన
న్యూయార్క్: బ్యాటింగ్‌లో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో దూకుడుగా ఆడారు...సూర్యకుమార్, రోహిత్ శర్మ కూడా కీలక పరుగులు సాధించారు. దూబే, సామ్సన్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు...బౌలింగ్‌లో కూడా ప్రధాన బౌలర్లంతా బరిలోకి దిగి ఆకట్టుకున్నారు...ఓవరాల్‌గా టి20 వరల్డ్ కప్‌లో ప్రధాన టోర్నీకి ముందు ఏకైక వామప్ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీని ద్వారా టీమ్ తుది జట్టుపై ఒక అంచనా కూడా వచ్చింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆడలేదు. యశస్వికి మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రధాన జట్టులో అతను ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో పాటు రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగవచ్చు. ఇక్కడ విఫలమైనా...టాపార్డర్‌లో సామ్సన్ పేరును టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుండగా, దూబే బౌలింగ్ చేయడాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నట్లే.
మరో వైపు కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం వరల్డ్ కప్ స్థాయికి తగినట్లుగా కనిపించలేదు. అవుట్‌ఫీల్డ్ బంతి పడ్డ ప్రతి చోటా దుమ్ము రేగడం చూస్తే ఈ స్టేడియంను సిద్ధం చేయడంలో ఐసీసీ తొందరపడినట్లు అనిపించింది. ఇదే వేదికపై భారత్ లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మ్యాచ్ ఫలితంతో సంతృప్తి చెందినట్లు, తాము అనుకున్న రీతిలో ప్రాక్టీస్ లభించినట్లు విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
శనివారం జరిగిన వామప్ పోరులో భారత్ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (32 బంతుల్లో 53 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.
సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించగా, రోహిత్ శర్మ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... శివమ్ దూబే (14), సంజు సామ్సన్ (1) విఫలమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది.
మహ్మదుల్లా (28 బంతుల్లో 40 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (34 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment