బనశంకరి: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టైన హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయకుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు. మీ పని మీరు చేయండి, నేనేమీ చెప్పను అని మొండికేసినట్లు తెలిసింది. ప్రశ్నలను తమ న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
తన మొబైల్‌ఫోన్ ఏడాది కిందట చోరీ అయ్యిందని, మీరు అడుగుతున్న మొబైల్‌ఫోన్ తన వద్ద లేదని సిట్ అధికారులకు చెప్పారు. అశ్లీల వీడియోలలో ఉన్నది మీరే కదా అని చూపించగా, ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదని, వారందరూ తనకు పరిచయం అంతే, నేను ఎవరిపై అత్యాచారానికి పాల్పడలేదని ప్రజ్వల్ చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణను ఎలా సాగించాలని సిట్ అధికారులు తలపట్టుకున్నారు.
నేడో రేపో ఘటనాస్థలికి
శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విచారించి భోజనం అందజేశారు. శనివారం కూడా విచారణ కొనసాగించారు. ఆదివారం లేదా సోమవారం హాసన్, హొళెనరసిపురలోని ఇళ్లకు ప్రజ్వల్‌ను తీసుకెళ్లి సంఘటనలు ఎలా జరిగాయో మహజరు పరిచే అవకాశముంది.
ముందస్తు బెయిలు కోసం తల్లి అర్జీ
ప్రజ్వల్ కేసులో ఓ బాధిత మహిళను అపహరించారనే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తల్లి భవానీ రేవణ్ణ శనివారం హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని సిట్ గతంలో నోటీసులు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో పరారీలో ఉన్నారని భవానీ కోసం సిట్ గాలిస్తోంది. ముందస్తు బెయిల్‌కోసం భవానీ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా అర్జీని తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనే భయంతో భవానీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్ విచారణ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో భవాని నివాసానికి ముగ్గురు మహిళా న్యాయవాదులు వెళ్లారు. వారు ఆమె తరఫున సిట్ అధికారులతో చర్చించారు. విచారణకు హాజరవుతారని, అరెస్టు కోసం ఒత్తిడి చేయరాదని సిట్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment