తమిళ ఉగాది త్వరలోనే రానుంది | Sakshi
Sakshi News home page

తమిళ ఉగాది త్వరలోనే రానుంది

Published Thu, Apr 13 2023 7:18 AM

- - Sakshi

ఉగాది పర్వదినం ఎప్పటికీ ప్రత్యేకమే అని సినీనటి నమిత అన్నారు. వివరాలు.. తమిళ ఉగాది పండగను డిశంబర్‌ 31గా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతంలో మార్చిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ఏప్రిల్‌ 14వ తేదీనే తమిళ ఉగాదిగా జరుపుకుంటున్నారు. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి కుర్రకారు కలల నటి నమిత కూడా డిశంబర్‌ 31వ తేది తమిళ ఉగాది కాదు అని పేర్కొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా వెలిగిన ఈమె తమిళంలో నటుడు విజయ్‌కాంత్‌కు జంటగా ఎంగళ్‌ అన్న చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు.

తరువాత సత్యరాజ్‌, విజయ్‌, అజిత్‌, శరత్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టి పాపులర్‌ అయ్యారు. అభిమానులను మచ్చాన్‌ అంటూ ముద్దుగా సంబోధిస్తూ వారి కలల రాణిగా మారారు. 2017లో తన ప్రేమికుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత అంతకు ముందే రాజకీయరంగ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా ఈమె మంగళవారం ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో అందరికీ తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అదే విధంగా తమిళ ఉగాది డిశంబర్‌ 31వ తేదీ కాదనీ, ఏప్రిల్‌ 14నేనని అన్నారు. తమిళ ఉగాది త్వరలోనే రానుందని, మీరంతా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

నటి నమిత

Advertisement
 
Advertisement
 
Advertisement