‘అన్న’లకు అనారోగ్యం! | Sakshi
Sakshi News home page

‘అన్న’లకు అనారోగ్యం!

Published Mon, Jun 19 2023 5:11 AM

Senior Maoists suffering from chronic ailments - Sakshi

ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం.

వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్‌ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది.

అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. 
అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్‌లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్‌ బ్యూరో సభ్యుడు, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. 

మంచానికే పరిమితమైన గణపతి?
మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్‌ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం.

సెంట్రల్‌ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్‌ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్‌ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్‌ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. 

స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? 
మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్‌ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్‌ ఇవే ఆరోపణలు చేశారు. 

జనజీవన స్రవంతిలోకి వస్తే  మేం చూసుకుంటామంటున్న ఖాకీలు 
పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్‌ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్‌ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement