Lok Sabha Election 2024: ఫరీద్‌కోట్‌...బహుముఖ పోటీ | Lok Sabha Election 2024: Faridkot as 2 two artistes, greenhorn, turncoat take centrestage | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఫరీద్‌కోట్‌...బహుముఖ పోటీ

Published Sat, Jun 1 2024 4:41 AM | Last Updated on Sat, Jun 1 2024 4:41 AM

Lok Sabha Election 2024: Faridkot as 2 two artistes, greenhorn, turncoat take centrestage

ప్రధాన అభ్యర్థులకు రైతుల నుంచి సెగ 

బరిలో ఇందిరా హంతకుని కుమారుడు

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ స్థానంలో బహుముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్, ఆప్‌ నుంచి నట గాయకుడు కరంజీత్‌ అన్‌మోల్‌ బరిలో ఉన్నారు. అకాలీదళ్, కాంగ్రెస్‌లకు తోడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగి గట్టి పోటీయే ఇస్తున్నారు. దాంతో శనివారం చివరిదైన ఏడో విడతలో పోలింగ్‌ జరిగే స్థానాల్లో ఫరీద్‌కోట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

కాంగ్రెస్‌కు కష్టాలు..  
ఫరీద్‌కోట్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం. పంజాబీ జానపద గాయకుడు మహ్మద్‌ సాదిక్‌ 2019లో గెలుపొందారు. ఈసారి ఆయన్ను కాదని అమర్‌జీత్‌ కౌర్‌ సాహోక్‌కు టికెటిచి్చంది. స్థానికురాలైన సాహోక్‌ దాన్నే ప్రధాన బలంగా మార్చుకుని ప్రచారం చేశారు. కానీ పారీ్టలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉండటం ఆమెకు మైనస్‌గా మారింది. 

సీనియర్‌ నేతలు ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో సాహోక్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఒక్క పెద్ద ర్యాలీ కూడా నిర్వహించలేకపోయింది! ఆప్‌ అభ్యర్థి అన్మోల్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు సన్నిహితుడు. తన స్టార్‌డమ్, మాన్‌ ప్రభుత్వ పనితీరు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. పంజాబీ నటులు, గాయకులు అన్మోల్‌కు మద్దతుగా జోరుగా ప్రచారం చేశారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయానికి కారణమైన సిక్కు సంస్థలు ఈసారి ఇండిపెండెంట్‌ సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సాకు దన్నుగా నిలిచాయి.

సూఫీల ఇలాకా... 
రాజ నగరంగా ప్రసిద్ధి చెందిన ఫరీద్‌కోట్‌ సూఫీ సాధువుల అడ్డా. బాబా ఫరీద్‌ నగరం అని కూడా అంటారు. ఈ లోక్‌సభ స్థానం 1977లో ఏర్పాటైంది. ఒకప్పుడు అకాలీదళ్‌కి కంచుకోట. 2014లో ఆప్, 2019 కాంగ్రెస్‌ గెలిచాయి. దీని పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లూ ఆప్‌ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కాస్త కలిసొచ్చే అంశం. ఒక్క అభ్యర్థి కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేదన్నది స్థానికుల ఆరోపణ. డ్రగ్స్, అభివృద్ధి లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. దీనికి తోడు రైతు ఆందోళనల ప్రకంపనలు ఈసారి అందరు అభ్యర్థులనూ తాకాయి!


బీజేపీకి చుక్కలు... 
గత ఎన్నికల్లో ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్‌ హన్స్‌ ఫరీద్‌కోట్కు పూర్తిగా కొత్త. ప్రచారం పొడవునా రైతు సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దానికి తోడు రైతులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీని మరింత ఇరుకున పెట్టాయి. ప్రచారంలో పాటలు పాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

అకాలీదళ్‌ కూడా ఈసారి ఎలాగైనా నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రాజి్వందర్‌ సింగ్‌ మాజీ ఎమ్మెల్యే శీతల్‌ సింగ్‌ కుమారుడు, మాజీ మంత్రి గురుదేవ్‌ బాదల్‌ మనవడు. 2015లో ఆప్‌లో చేరిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ అకాలీదళ్‌కు తిరిగొచ్చారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్నే నమ్ముకున్నారు. ఫరీద్‌కోట్‌కు తన కుటుంబం ఎంతో సేవ చేసిందంటూ ప్రచారం చేశారు. దళిత ప్రాబల్యమున్న ఫరీద్‌కోట్‌లో బీఎస్పీ పోటీ ప్రధాన పారీ్టల అవకాశాలను దెబ్బ తీసేలా ఉంది.

– సాక్షి, న్యూఢిల్లీ    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement