పండగే పండగ.. మనకు కాదు.. కరోనాకు.. | Sakshi
Sakshi News home page

పండగే పండగ.. మనకు కాదు.. కరోనాకు..

Published Mon, Oct 5 2020 5:09 AM

Central Government Requests Telangana Government Over Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ ఒకవైపు... కరోనా వేళ బతుకలేనమ్మ మరోవైపు.. గుంపులు, గుంపులుగా చేరి పండగ చేసుకుందామంటే.. గుబులు గుబులుగా ఉంది పరిస్థితి. ఓనం పండగ తర్వాత కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళీయులు కేరళకు వెళ్లడం, అక్కడ పండగను సందడిగా నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా, దీపావళి పండగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ ఉత్సవాలను జరుపుకోలేదు. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను నిర్వహిస్తే వైరస్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.  

తెలంగాణకు ప్రాణం బతుకమ్మ... 
తెలంగాణ పండగల్లో కీలకమైనది దసరా. బతుకమ్మ ఆటపాటలు మరీ ముఖ్యమైనవి. వీటిని ఆడపడుచులు ఒకచోట గుమిగూడి నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ చేపడుతోంది. బతుకమ్మ పండగను పురస్కరించుకొని మహిళలు ఒక చోట నుంచి మరోచోటకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు. ఆ తర్వాత క్రిస్‌మస్, సంక్రాంతి పండగలు వరుసగా ఉన్నాయి. వాటి విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై సర్కారులో తర్జనభర్జన సాగుతోంది.  

కేసుల పెరుగుదలతో జాగ్రత్తలు తప్పనిసరి  
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. పల్లెల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజుకు పది వరకు కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం సీజన్‌ దాటి చలికాలం ప్రారంభ దశలో ఉన్నాం. సహజంగా వైరస్‌ వ్యాప్తికి చలికాలం వాహకంగా ఉంటుంది. ఫ్లూ వంటి వ్యాధులు ఈ కాలంలోనే విజృంభిస్తాయి.  

ఎలా నిర్వహించుకోవాలి?  
ఈ పండగల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీకాలేదు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు.  
► భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం,  చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.  
► పండుగల సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలి. 
► పండగలకు బంధువులను పిలవకుండానే ఎవరికివారు తమ ఇళ్లలో నిర్వహించుకోవాలి.  
► కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసోలేషన్‌లోనే ఉండాలి. పండగలకు హాజరుకాకూడదు.  
► దీపావళి విషయంలో ఇదే మాదిరి చర్యలు తీసుకోవాలి.   

Advertisement
 
Advertisement
 
Advertisement