
పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.