అంధ విద్యార్థులపై కర్కశత్వం
అల్లరి నెపంతో ముగ్గురిని తీవ్రంగా కొట్టిన ప్రిన్సిపాల్, కరస్పాండెంట్
నిందితులకు దేహశుద్ధి చేసిన బాధితుల బంధువులు, వివిధ సంఘాల ప్రతినిధులు
సాక్షి, కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా): అసలే బాలలు.. ఆపై అంధులు.. తెలిసీ తెలియక ఓ తప్పు చేశారేమో... పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ రెచ్చిపోయారు... అంధ విద్యార్థులపై అమానుషంగా దాడి చేశారు... వదిలేయమని ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా చావబాదారు... ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు... ఈ దారుణాల్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు అందజేయడంతో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతి నిధులు స్కూల్‌కు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల కమిటీ కోరింది. ఇది చాలా దారుణమైన చర్యని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కుషాల్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, విద్యార్థుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంస్థలు, విదేశీ విరాళాలతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద కె.వి.రావు గ్రీన్‌ఫీల్డ్స్ అంధుల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థకు కె.వి.రావు కరస్పాండెంట్‌గా, శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ అంధులే. ఈ నెల 18న విద్యార్థులు సాయి (9), సురేంద్రవర్మ (12), జాన్సన్ (13) అల్లరి చేశారని ఆగ్రహించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో తీవ్రంగా కొట్టారు. ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దారుణాల్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు సోమవారం అందజేశాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సంఘటనపై ఎంఈవోను విచారణాధికారిగా నియమించినట్లు డీ ఈవో తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదుచేసి రావు, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌ల చేతుల్లో గాయపడిన సాయి, సురేంద్రవర్మ, జాన్సన్‌లను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.